Nalini Chidambaram
-
కవిత కేసు విచారణ 3 వారాలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంపై విచారణ కోసం ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలన్న ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద మహిళలను ఇంటి వద్దే విచారించేలా ఈడీని ఆదేశించాలన్న ఆమె అభ్యర్థనపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే తరహాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరం పిటిషన్‌తో దీనిని జత చేసింది. కేసు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్ 24 తో ప్రారంభమయ్యే వారంలో విచారణ జాబితాలో కేసును చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ సెక్షన్ ఈడీకి వర్తించదు: అదనపు సొలిసిటర్ జనరల్ కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇంటి వద్ద విచారించాలా లేక ఈడీ కార్యాలయంలోనా అనేది ప్రశ్న అని తెలిపారు. ఈ తరహా కేసులో మద్రాస్ హైకోర్టు అభిప్రాయం స్పష్టంగా ఉందిగా అని ధర్మాసనం పేర్కొనగా సుప్రీంకోర్టు తదుపరి తీర్పుల ప్రకారం మద్రాస్ హైకోర్టు తీర్పు మనుగడలోకి రావని ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50 అంటే దర్యాప్తు కాదని కేవలం విచారణ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ఈడీకి వర్తించదన్నారు. అయితే పీఎంఎల్ఏ కేసుల్లో సమన్ల ప్రక్రియ లేదని సిబల్ పేర్కొన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 (2)లో స్పష్టంగా ఉందిగా అని జస్టిస్ రస్తోగి ప్రశ్నించగా.. అది కేవలం విచారణ కోసమేనని... ఆ దిశలోనే నోటీసులు అందాయని సిబల్ తెలిపారు. అయితే దీనిపై సంక్షిప్తంగా ఓ నోట్ ఇవ్వాలని సిబల్‌ను ధర్మాసనం ఆదేశించింది. పీఎంఎల్ఏ చాప్టర్ 8 (సమన్లు, సాక్ష్యాలకు సంబంధించి అధికారులకు ఉన్న అధికారం) పరిశీలించాలని కోరిన సిబల్... దీని తర్వాత సమన్ల గురించి మాట్లాడే చాప్టర్ లేదని.. పీఎంఎల్ఏ ప్రకారం సమన్ల ప్రక్రియ లేదని తెలిపారు. ‘ఫిర్యాదులో పిటిషనర్‌ను నిందితురాలుగా పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిగా అభివర్ణించారు. అయితే జారీ చేసిన సమన్లు కేవలం విచారణ కోసమే. ఏ విధమైన ప్రక్రియ లేనప్పుడు కోడ్ అమలు అవుతుందని పీఎంఎల్ఏ చెబుతోంది’అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసును నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో జత చేస్తామని జస్టిస్ రస్తోగి పేర్కొన్నారు. అయితే అభిషేక్ బెనర్జీ కేసు దీనికి సంబంధించినది కాదని.. అందువల్ల దాంతో జత చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం ఈ కేసును నళినీ చిదంబరం కేసుతో జత చేస్తామని. ఆ విధంగా చేసి వాదనలు వినడమే శ్రేయస్కరమని పేర్కొంది. -
నళినీ చిదంబరానికి ఊరట
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరానికి కలకత్తా హైకోర్టు సోమవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ నళినీ చిదంబరంను అరెస్ట్ చేయకుండా దర్యాప్తు ఏజెన్సీను నిరోధించింది. దర్యాప్తునకు సహకరించాలని నళినీ చిదంబరంను ఆదేశించిన కోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచుతూ జస్టిస్ జోమాల్య బాగ్చి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా తమ వాదనలకు మద్దతుగా నళినీ చిదంబరం, సీబీఐ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి శారదా చిట్ ఫండ్ సంస్థ అక్రమంగా సేకరించిన సొమ్ము నుంచి సీనియర్ న్యాయవాది నళినీ చిదంబరానికి రూ 1.3 కోట్లు చెల్లించారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే మనోరంజన సింగ్‌కు న్యాయసలహాదారుగా ఆమెకు ఆ మొత్తం చెల్లించారని నళినీ చిదంబరం న్యాయవాది ఘోష్ న్యాయస్ధానానికి నివేదించారు. -
నళినీ చిదంబరంపై చార్జ్‌షీట్
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్ విచారణలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరంపై సీబీఐ శుక్రవారం చార్జ్‌షీట్ నమోదు చేసింది. కోల్‌కతాలోని బరాసత్ కోర్టులో దర్యాప్తు సంస్థ ఈ చార్జిషీట్‌ను సమర్పించింది. ఈ కుంభకోణంలో నళీనీ చిదంబరం రూ 1.4 కోట్లు ముడుపులు స్వీకరించారని సీబీఐ ఆరోపించింది. శారదా గ్రూప్ యజమాని, ప్రమోటర్ సుదీప్త సేన్‌తో కుమ్మక్కైన నళినీ చిదంబరం మోసపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ 2010 నుంచి 2014 మధ్య రూ 1.4 కోట్లు చేజిక్కించుకున్నారని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. సెబీ, ఆర్ఓసీ విచారణలను మేనేజ్ చేసేందుకు గాను 2010-12 మధ్య సేన్ కంపెనీల నుంచి ఆమె రూ 1.4 కోట్లు రాబట్టారని వెల్లడించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో నళినీ చిదంబరంను తొలుత 2016 సెప్టెంబర్‌లో సాక్షిగా దర్యాప్తుసంస్ధలు పిలిచాయి. ఓ టీవీ చానల్ డీల్‌కు సంబంధించి కోర్టుకు హాజరైనందుకు శారదా గ్రూప్ తరపున వాదనలు వినిపించినందుకు నళినీ చిదంబరం రూ 1.26 కోట్లు ఫీజుగా వసూలు చేశారు. కాగా శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో దాఖలైన ఆరవ అనుబంధ చార్జిషీట్లో నళినీ చిదంబరంతో పాటు అనుభూతి ప్రింటర్స్ అండ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుదీప్త సేన్లను సహ నిందితులుగా సీబీఐ పేర్కొంది. -
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్‌క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిదంబరం భార్యకు బిగుసుకుంటున్న శారదా స్కాం
పశ్చిమబెంగాల్‌తో పాటు దేశాన్నే కుదిపేసిన శారద చిట్‌ఫండ్ స్కాం ఉచ్చులో మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం భార్య నళిని చిదంబరం బిగుసుకుపోతున్నారు. ఈ స్కాం కేసులో మనీ లాండరింగ్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నళిని చిదంబరాన్ని ఈడీ ఆదేశించింది. సెప్టెంబర్ మొదటివారంలో కోల్‌కత్తాలోని విచారణ టీమ్ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. శారదా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్‌కు నళిని చిదంబరం న్యాయవాదిగా నిర్వర్తించారు. ఆమె అభ్యర్థన మేరకు శారదా కేసులో నళిని వాదనలు వినిపించారు. అయితే దీనికోసం ఆమె రూ.1.26 కోట్ల ఫీజును చిట్‌ఫండ్ నుంచి పొందారని వాదనలు వినిపించాయి. దీనిపై ఆదారాలు సేకరించిన సీబీఐ, చిట్‌ఫండ్ యాజమాన్యం, మనోరంజన్సింగ్లతో పాటు, నళినీని చార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రస్తుతం శారదా కంపెనీ అకౌంట్ల నుంచి ఆమెకు నగదు బదిలీ ఎలా జరిగిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. గతంలోనే ఈ విషయంలో సీబీఐ, ఈడీ నుంచి నళిని విచారణ ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం కొత్త సాక్ష్యాలతో నళినీ విచారణను ఎదుర్కోబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
నళిని చిదంబరానికి సీబీఐ సమన్లు
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరానికి శుక్రవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి ఆమె హాజరు కావాల్సి ఉంది. శారదా కేసుకు సంబంధించి గతంలో సీబీఐ నమోదు చేసిన ఆరో అనుబంధ చార్జ్ షీట్లో నళిని చిదంబరం పేరును ప్రస్తావించింది. అయితే ఈ కేసులో నిందితురాలిగా గానీ, సాక్షిగా గానీ నళిని పేరును ప్రస్తావించని సీబీఐ.. వివాదాస్పద చానెల్ ఒప్పంద విషయంలో ఆమె వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. -
శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య
కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం భార్య నళిని చిదంబరం పేరును చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు సమర్పించిన అదనపు ఆరో చార్జిషీటులో సీబీఐ అధికారులు నళిని పేరును చేర్చినట్లు ఆ శాఖ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆమెను ఇందులో నిందితురాలిగా చేర్చారా లేక సాక్షిగా చేర్చారా అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిలో ఎలాంటి వివరాలు తెలిపేందుకు కూడా సీబీఐ అధికారులు నిరాకరించారు. 'శారదా కుంభకోణం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్‌కు ఆమె(నళిని వ్యక్తిగత న్యాయవాది. శారదా సంస్థ ద్వారానే ఆమెకు ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు' అని ఓ సీబీఐ అధికారి తెలిపారు.