సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంపై విచారణ కోసం ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలన్న ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద మహిళలను ఇంటి వద్దే విచారించేలా ఈడీని ఆదేశించాలన్న ఆమె అభ్యర్థనపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే తరహాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరం పిటిషన్‌తో దీనిని జత చేసింది. కేసు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్ 24 తో ప్రారంభమయ్యే వారంలో విచారణ జాబితాలో కేసును చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఆ సెక్షన్ ఈడీకి వర్తించదు: అదనపు సొలిసిటర్ జనరల్
కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇంటి వద్ద విచారించాలా లేక ఈడీ కార్యాలయంలోనా అనేది ప్రశ్న అని తెలిపారు. ఈ తరహా కేసులో మద్రాస్ హైకోర్టు అభిప్రాయం స్పష్టంగా ఉందిగా అని ధర్మాసనం పేర్కొనగా సుప్రీంకోర్టు తదుపరి తీర్పుల ప్రకారం మద్రాస్ హైకోర్టు తీర్పు మనుగడలోకి రావని ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదించారు.
మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50 అంటే దర్యాప్తు కాదని కేవలం విచారణ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ఈడీకి వర్తించదన్నారు. అయితే పీఎంఎల్‌ఏ కేసుల్లో సమన్ల ప్రక్రియ లేదని సిబల్ పేర్కొన్నారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 (2)లో స్పష్టంగా ఉందిగా అని జస్టిస్ రస్తోగి ప్రశ్నించగా.. అది కేవలం విచారణ కోసమేనని... ఆ దిశలోనే నోటీసులు అందాయని సిబల్ తెలిపారు.
అయితే దీనిపై సంక్షిప్తంగా ఓ నోట్ ఇవ్వాలని సిబల్‌ను ధర్మాసనం ఆదేశించింది. పీఎంఎల్‌ఏ చాప్టర్ 8 (సమన్లు, సాక్ష్యాలకు సంబంధించి అధికారులకు ఉన్న అధికారం) పరిశీలించాలని కోరిన సిబల్... దీని తర్వాత సమన్ల గురించి మాట్లాడే చాప్టర్ లేదని.. పీఎంఎల్‌ఏ ప్రకారం సమన్ల ప్రక్రియ లేదని తెలిపారు. ‘ఫిర్యాదులో పిటిషనర్‌ను నిందితురాలుగా పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిగా అభివర్ణించారు.
అయితే జారీ చేసిన సమన్లు కేవలం విచారణ కోసమే. ఏ విధమైన ప్రక్రియ లేనప్పుడు కోడ్ అమలు అవుతుందని పీఎంఎల్‌ఏ చెబుతోంది’అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసును నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో జత చేస్తామని జస్టిస్ రస్తోగి పేర్కొన్నారు.
అయితే అభిషేక్ బెనర్జీ కేసు దీనికి సంబంధించినది కాదని.. అందువల్ల దాంతో జత చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం ఈ కేసును నళినీ చిదంబరం కేసుతో జత చేస్తామని. ఆ విధంగా చేసి వాదనలు వినడమే శ్రేయస్కరమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment