nallcheruvu
-
అధికారులకు ఆయనంటే హడల్ !
నల్లచెరువు : మండలంలోని అధికారులకు అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడిని చూస్తే దడ. ఎప్పుడేం చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రతి పని తాను చెప్పినట్లు చేస్తే సరే.. లేకుంటే వారిపై తన ప్రతాపం చూపుతాడు. అధికారులకు తలనొప్పిగా మారిన ఆ నాయకుడే.. మండల జెడ్పీటీసీ నాగరత్నమ్మ భర్త నాగభూషణం. వివరాల్లోకి వెళితే.. ప్రతి పని తాను చెప్పినట్లే చేయాలనే నాగభూషణం రెండు రోజుల క్రితం పింఛన్ల విషయంపై ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ మగ్బూల్బాషాతో ఆరా తీశాడు. మండలానికి 230 పింఛన్లు మంజూరయ్యాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు మంజూరు చేశామని ఎంపీడీఓ ఆయనకు చెప్పాడు. అయితే అయితే పీడీ జెడ్పీటీసీ కోటా కింద 10 పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారని, తాను ఎంపిక చేసిన లబ్ధిదారుడికే పింఛన్ ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాలని నాగభూషణం ఎంపీడీఓకు హుకుం జారీ చేశాడు. ఇందుకు ఎంపీడీఓ స్పందిస్తూ తనకు పీడీ నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పగా ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన సదరు నాయకుడు ఎంపీడీఓపై దురుసుగా ప్రవర్తిస్తూ ‘నీ అంతు చూస్తా. నీవు ఎలా ఉద్యోగం చేస్తావో’ అని ఛాంబర్లోని కుర్చీని తీసుకుని ఎంపీడీఓపై విసరడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. లేకుంటే కుర్చీ ఎంపీడీఓకు తగిలేదని సిబ్బంది చర్చించుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. అయితే అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ‘నీ చేతనైంది చేసుకోపో’ అని అనడంతో దిక్కు తోచని స్థితిలో నాగభూషణం వెనుదిరిగాడు. చివరికి జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు పింఛన్లు ఎంపిక చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. మరోవైపు నాగభూషణం తీరుతో తాము ఎలా ఉద్యోగాలు చేసుకోవాలని అధికారులు మండిపడుతున్నారు. ఆ రౌడీషీటర్ ఆది నుంచి అంతే.. : గత 15 ఏళ్ల క్రితం ఓ రెవెన్యూ అ«ధికారిపై దాడి చేసిన ఘటనలో నాగభూషణంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. ఆయన తన అధికార దర్పాన్ని ఉపయోగిస్తూ పలుమార్లు అధికారులపై, కిందిస్థాయి ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. -
ఎర్రచందనం కూలీల అరెస్ట్
నల్లచెరువు : నల్లచెరువు పాత రైల్వేస్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఎర్ర చందనం చెట్టు నరికేందుకు వెళుతున్న ముగ్గురు కూలీలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో వస్తున్న ఇద్దరు తప్పించుకుని వెళ్లారన్నారు. వీరి వెనుక టాటా çసుమో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులైన ఎన్పీకుంటకు చెందిన కారుడ్రైవర్ లోకేశ్వరరెడ్డి, సాంబశివయ్య, కడపలవాండ్లపల్లికి చెందిన శ్రీనివాసులును ప్రశ్నించగా సమాధానం సక్రమంగా చెప్పలేదన్నారు. అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం చెట్లు నరికేందుకు తీసుకుపోతున్న గొడ్డళ్లు, ఇనుప రంపాలు కనిపించాయన్నారు. వారిని విచారించగా తమను ఎన్పీ కుంటకు చెందిన హరిబాబు, బద్రిలు తెలిపిన మేరకు సుండుపల్లి అడవులలో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళుతున్నామని సమాధానం ఇచ్చారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారు.