భారత్‌కు యురేనియం సరఫరాను పరిశీలిస్తాం
- నమీబియా అధ్యక్షుడు హేజ్ వెల్లడి
- రాష్ట్రపతి ప్రణబ్‌కు విందు
విండ్‌హాక్ (నమీబియా): అణు శక్తిని ప్రపంచ శాంతి కోసం వినియోగిస్తే భారత్‌కు యురేనియంను సరఫరా చేసే విషయంలో ఉండే చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని నమీబియా తెలిపింది. నమీబియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ దేశాధ్యక్షుడు హేజ్ గీంగోబ్ విందులో ఈమేరకు చెప్పారు. ‘నమీబియాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ మా వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లే వు. అందుకే వాటిని వినియోగించుకోవడం లేదు. శాంతి నిమిత్తం ఉపయోగించే భారత్‌లాంటి దేశానికి మా యురేనియం వనరులను సరఫరా చేసేందుకు కావాల్సిన చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తాం’ అని ఆయన అన్నారు.
తమ దేశంలో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సిందిగా హేజ్ ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రణబ్ తెలిపారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఆఫ్రికా, భారత్‌లు కీలకంగా మారాయని తద్వారా ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధికి ఇరు దేశాలు కృషి చేయాలని చెప్పారు. నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోనూ ప్రణబ్ మాట్లాడారు.