రాజకీయాల్లోకి నమిత
ఎప్పటి నుండో తారలు రాజకీయ రంగంలో తలుక్కుమంటూనే ఉంటున్నారు. తాజాగా సినీ నటి నమిత రాజకీయాలపై మనసు పారేసుకుంది. త్వరలో ఓ మంచి రాజకీయ పార్టీలో చేరుతానని ఈ బొద్దుగుమ్మ తన మనసులోని కోరికను వెల్లడించింది. మచ్చాన్ (బావ) అంటూ అందరినీ ప్రేమతో పలుకరించే నమిత అభిమానుల కలల రాణి. ఈ బ్యూటీ ఒక దశలో క్రేజీ హీరోయిన్గా వెలుగొందింది. కాస్త బరువెక్కడంతో అవకాశాలు తగ్గాయి. ఇతర వ్యాపారాలతో బిజీగా ఉన్న నమిత ప్రస్తుతం తన దృష్టిని సామాజిక సేవలపై సారిస్తోంది.
రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు సేవలందిస్తోంది. పలు సంక్షేమ సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా పాల్గొంటున్నా ఆమె ఈ మధ్య కాలంలో చెన్నైలో నిర్వహించిన ఓ నేత్రదాన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. అంతే కాకుండా రాయపేటలో ఒక మహిళా మరుగుదొడ్డిని కట్టించి ప్రారంభించింది కూడా.
విదేశాల్లో వీధికొక్క మరుగుదొడ్డి ఉంటే మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితిలేదని... అదే విధంగా చెన్నై నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా... అందుకు తనకు చేయూతనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని నమిత వాపోయింది. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికే ముందు జాగ్రత్తగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది ఆమె. ఇప్పటికే తమిళనాట ఒకప్పటి అందాల నటి కుష్బూ కూడా డీఎంకేలో చురుకైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే నమిత ఏ పార్టీలో చేరుతుందనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఇంతకి నమిత ఏ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు?