nanded train accident
-
`నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై నెలరోజుల్లో నివేదిక`
అనంతపురం: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా ఘటనపై 39మందిని విచారించామని, నెలరోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను ఇస్తామని రైల్వే సేఫ్టీ కమిషనర్ సంతోష్‌మిట్టల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు వద్ద శనివారం తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 26మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని సంతోష్‌మిట్టల్ చెప్పారు. గత ఏడాది జరిగిన పెనుకొండ ప్రమాదంపై కూడా నివేదికను ఎప్పుడో అందజేసినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సరైన భద్రతా ప్రమాణాలు అందులో సూచించామని రైల్వే కమిషనర్ సంతోష్‌మిట్టల్ తెలిపారు. -
గంగోత్రి ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు
విజయవాడ: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగి రెండు రోజులైనా కాకముందే మరో రైల్లో మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. విజయవాడలో గంగోత్రి ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. ఆరో నంబర్ ప్లాట్ ఫామ్‌పై ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. అయితే మీడియాను రైల్వేస్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటలు అంటుకోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా?: జేసీ
అనంతపురం: వోల్పో బస్సు దుర్ఘటనపై మాజీ మంత్రి దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాలెం ఘటన తర్వాత తమను అరెస్టు చేయమంటున్నారని, నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటనకు బాద్యుడిని చేస్తూ రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. తమవి దొంగ బస్సులైతే పర్మిట్లు రద్దు చేయాలని సవాల్ విసిరారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ పాత బస్సులకు పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పాలెం ఘటన వార్తలపై కొందరు మీడియా ప్రతినిధులు తమను బ్లాక్‌మొయిల్ చేస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సుకు మంటలంటుకుని 45 మంది సజీవ దహనమైన సంగతి విదితమే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయాల చొప్పున పరిహారం చేతులు దులుపుకుంది. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. -
నవదంపతుల మృత్యువాత
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పిడుగులాంటి వార్త విన్న కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడు ఆరునెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశాడంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. మృతదేహాలను బుధవారం అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వారంతా అక్కడే పడగాపులు గాస్తున్నారు. అనంతపురంలోని నీలిమ థియేటర్ సమీపంలో పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీనివాస్ (28), శ్రీకాంత్ ఇద్దరు కుమారులు. ఇద్దరూ బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరునెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీలతతో శ్రీనివాస్ వివాహం జరిగింది. శ్రీలత, శ్రీనివాస్ దంపతులు బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేందుకు వారు అనంతపురం రావాలనుకున్నారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ తన తండ్రి చంద్రశేఖర్‌కి ఫోన్ చేసి అనంతపురం వస్తున్నట్లు చెప్పాడు. ఇంతలోనే దంపతులిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారని సమాచారం అందడంతో శ్రీనివాస్ తల్లిదండులు తల్లడిల్లిపోయారు. 24 గంటల అనంతరం శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడ్డారని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
విద్రోహ చర్యా?
పొంతనలేని మంత్రులు, అధికారుల ప్రకటనలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణాలపై మంత్రు లు, అధికారుల ప్రకటనలకు పొంతన కుదరడం లేదు. ఒకరు విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతుంటే.. మరొకరు విద్రోహచర్యను కొట్టిపారేయలేమంటున్నారు. వీరి పొంతనలేని ప్రకటనలతో ప్రమాద కారణాలపై స్పష్టత కరవైంది. పేలుడు పదార్థాల వంటి విద్రోహ చర్య వల్ల ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందా అన్న అంశంపై సమగ్ర విచారణ చేస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ భార్గవ్ ప్రకటించారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్యను కొట్టిపారేయలేమన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే.. రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే, ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాత్రం విద్రోహ చర్య వాదనను కొట్టిపారేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మంత్రులు.. జీఎం ప్రకటనలు పూర్తివిరుద్ధంగా ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో జీఎం రాజీవ్ భార్గవ్ విలేకరులతో మాట్లాడారు. విద్రోహ చర్యను ఏమాత్రం కొట్టిపారేయడానికి వీల్లేదని.. సాంకేతిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించి.. సమగ్ర విచారణ చేయిస్తామని ప్రకటించారు. అనంతరం ప్రమాద ప్రదేశానికి చేరుకున్న రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాత్రం ప్రమాదం వెనుక విద్రోహ చర్య లేదన్నారు. మధ్యాహ్నం ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.