పొంతనలేని మంత్రులు, అధికారుల ప్రకటనలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణాలపై మంత్రు లు, అధికారుల ప్రకటనలకు పొంతన కుదరడం లేదు. ఒకరు విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతుంటే.. మరొకరు విద్రోహచర్యను కొట్టిపారేయలేమంటున్నారు. వీరి పొంతనలేని ప్రకటనలతో ప్రమాద కారణాలపై స్పష్టత కరవైంది. పేలుడు పదార్థాల వంటి విద్రోహ చర్య వల్ల ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందా అన్న అంశంపై సమగ్ర విచారణ చేస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ భార్గవ్ ప్రకటించారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్యను కొట్టిపారేయలేమన్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే.. రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే, ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాత్రం విద్రోహ చర్య వాదనను కొట్టిపారేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మంత్రులు.. జీఎం ప్రకటనలు పూర్తివిరుద్ధంగా ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో జీఎం రాజీవ్ భార్గవ్ విలేకరులతో మాట్లాడారు. విద్రోహ చర్యను ఏమాత్రం కొట్టిపారేయడానికి వీల్లేదని.. సాంకేతిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించి.. సమగ్ర విచారణ చేయిస్తామని ప్రకటించారు. అనంతరం ప్రమాద ప్రదేశానికి చేరుకున్న రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాత్రం ప్రమాదం వెనుక విద్రోహ చర్య లేదన్నారు. మధ్యాహ్నం ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.