భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వేళల్లో మార్పులు
సికింద్రాబాద్ నుంచి బల్లార్ష మధ్య రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో పాక్షిక మార్పులు చేశారు. ఆసిఫాబాద్ రోడ్డు, విహిరిగాన్ల మధ్య గురువారం నుంచి రైలు వేళల్లో మార్పులు అమలుకానున్నాయి. ఈ మేరకు ఈ రైలు ప్రస్తుత సమయం ప్రకారమే మధ్యాహ్నం 3.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్ నుంచి మాత్రం రాత్రి 8.25 కు బదులు 10.25 గంటలకు బయలుదేరుతుంది. సిరిపూర్ కాగజ్నగర్ స్టేషన్లో రాత్రి 9.50 గంటలకు బదులు 11.10 గంటలకు, సిర్పూర్ టౌన్ నుంచి రాత్రి 10.15 కు బదులు 11.20 గంటలకు బయలుదేరుతుంది. మాకుడి స్టేషన్ నుంచి రాత్రి 10.30 కి బదులు 11.40 గంటలకు, వీరూర్ స్టేషన్లో 10.50 కి బదులు 11.50 కి, విహిరిగాన్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బదులు 12.15 కు బయలుదేరుతుంది.బల్లార్ష స్టేషన్కు మాత్రం ప్రస్తుతం ఉన్న సమయం ప్రకారమే అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకుంటుంది.
రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల స్టేషన్ల్లోమార్పు
బెల్లంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్ రైళ్ల స్టేషన్ల్లో ఈ నెల 15 నుంచి మార్పులు చేయనున్నారు. బెల్లంపల్లి-హైదరాబాద్ (17012) ఎక్స్ప్రెస్ నాంపల్లికి బదులుగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తుంది. ఇది ఉదయం 11 గంటలకు బెల్లంపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. హైదరాబాద్-బీదర్ (17010) ఎక్స్ప్రెస్ కూడా నాంపల్లికి బదులు సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతుంది. ఇది సాయంత్రం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.15 గంటలకు బీదర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగానే ఈ రైలు బీదర్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకే వస్తుంది.
విశాఖ-నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇక నుంచి వారానికి 3 సార్లు
విశాఖపట్టణం-నాందేడ్-విశాఖపట్టణం (18509/18510) బై వీక్లీ ఎక్స్ప్రెస్ను మంగళవారం నుంచి వారానికి 3 రోజులు నడపనున్నారు. ఇప్పటి వరకు ఈ రైలు బుధ,శని వారాల్లో విశాఖ నుంచి బయలుదేరుతుండగా ఇక నుంచి ఆ రెండు రోజులతో పాటు మంగళవారం కూడా విశాఖ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు బుధ,గురు,ఆది వారాల్లో ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది. తిరిగి 9.20 కి బయలుదేరుతుంది. నాందేడ్ నుంచి విశాఖకు ఇప్పటి వరకు గురు,ఆది వారాల్లో బయలుదేరుతుండగా, ఇక నుంచి బుధవారం కూడా బయలుదేరుతుంది. నాందేడ్ నుంచి విశాఖకు వెళ్లేటప్పుడు బుధ,గురు,ఆది వారాల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. తిరిగి 9.30 కు విశాఖకు బయలుదేరుతుంది.