డుమ్మాలే అధికం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మా సమస్యలపై గొంతెత్తండి అంటూ శాసనసభకు జిల్లా ప్రజలు పంపిన నేతల పనితీరు ఎలా ఉంది. ఆశించిన రీతిలో వారు రాణించగలిగారా? ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపారా? వంటి అంశాల ను విశ్లేషించే ముందు అసలు ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు సభకు హాజరయ్యారు? డుమ్మాలు కొట్టడంలో ఎవరు ముందున్నారు వంటి అంశాలను అసెంబ్లీ వెబ్సైట్ రికార్డులను పరిశీలిస్తే అసలు విషయాలు వెల్లడవుతాయి. తాజాగా వాయిదాపడిన శాసన సభ 13వ విడత సమావేశాలను మినహాయిస్తే, మన ఎమ్మెల్యేల హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేదు. మరో నాలుగు నెలల్లో 13వ శాసన సభ కాల పరిమితి ముగియనుంది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో శాసనసభ 12 పర్యాయాలు విడతల వారీగా కొలువుదీరింది.
2009 జూన్ నుంచి 2013 జూన్ వరకు శాసనసభ 173 రోజుల పాటు సమావేశమైంది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం వెతకాల్సిన శాసనసభ్యులు రోజుల తరబడి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. అభివృద్ధి సాధిస్తున్నామంటూ నియోజకవర్గాల్లో ఊదరగొడుతున్న నేతలు రోజుల తరబడి అసెంబ్లీ ముఖం చూడటం లేదు. జీత భత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు ఎంతసేపు అసెంబ్లీలో గడిపారు, ఎన్ని అంశాలను ప్రస్తావించారు, ఎన్నింటికి సమాధానాలు రాబట్టగలిగారనే విషయాలపైనా మదింపు జరిగితే ఎవరు ఎంత పనిచేశారో వెల్లడయ్యేది.
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి హాజరు వివరాలు మినహాయిస్తే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల్లో నారాయణఖేడ్ శాసన సభ్యులు పి. కిష్టారెడ్డి, గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మెరుగైన హాజరుశాతం నమోదు చేశారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టక ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 119 రోజులకు గాను 55 రోజులు డుమ్మా కొట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ శాసనసభకు ముఖం చాటేసిన ఎమ్మెల్యేల్లో ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా 2010లో హరీష్‌రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి జూలై వరకు 38 రోజుల పాటు జరిగిన సమావేశాలకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన హాజరు శాతం తగ్గింది.