నవ నవలారాణి
కాళిదాసు తన మేఘ సందేశంలో వర్ణించిన యక్ష రాజధాని అలకాపురిలో ఆనందబాష్పాలు తప్ప వేరే కన్నీళ్లు లేవు. విరహతాపం తప్ప వేరే బాధలు లేవు. ప్రణయ కలహం వల్ల తప్ప వేరే వియోగం లేదు. ఇంత అందమైన ప్రపంచంలోకి రెండు తరాల పాఠకుల్ని తీసుకెళ్లి, సేదతీర్చిన ఘనత యద్దనపూడి సులోచనారాణిదే! స్కూల్ ఫైనల్లో ఉండగానే తొలి కథ ’చిత్ర నళినీయం’ రాశారు. ఆమె ప్రస్థానం ఆంధ్ర వారపత్రికలో ఆరంభమైంది. మొదట్లో వరసగా ఏడెనిమిది కథలు రాశారు. ఆనాటి పత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహనరావు ఆమెలోని ప్రతిభని గుర్తించి బాగా ప్రోత్సహించారు. సులోచనారాణి పెళ్లాడి, పుట్టిల్లు కాజ వదిలి హైదరాబాద్ కాపరానికి వచ్చారు. రచనలపై మమకారం మరింత పెంచుకున్నారు.
1963 జనవరిలో బాపు రమణలు విజయవాడ కేంద్రంగా జ్యోతి మంత్లీ ప్రారంభించారు. ప్రారంభ సంచికలో హేమాహేమీల రచనలతోపాటు సులోచనారాణి కథ జ్యోతి కథ కనిపిస్తుంది. జ్యోతి మంత్లీని నండూరి ఎడిట్ చేసేవారు. తర్వాత 1964లో సెక్రటరీని కొంచెం పెద్దకథగా రాసి పంపారు యద్దనపూడి. దాన్ని నవలగా పెంచి పంపమని నండూరి సెక్రటరీని వెనక్కి పంపారు. నవల చేసి పంపారు. ఇక తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో జ్యోతి మంత్లీ వెల అరవై పైసలుండేది. సెక్రటరీ సీరియల్ ఉత్కంఠ తట్టుకోలేని పాఠకులు కొందరు, ప్రెస్ దగ్గర దొంగ బేరాలాడి ఆ ఒక్కఫారమ్నీ పావలా ఇచ్చి ముందుగా కొనుక్కు వెళ్లేవారట! మొదటి మెట్టులోనే సులోచనారాణికి అంతటి పేరొచ్చింది.
చాలా దీక్షగా ప్రొఫెషనలిజమ్‌తో నవలా వ్యాసంగాన్ని ఆమె కొనసాగించారు. ఏకకాలంలో మూడు నాలుగు ధారావాహికలు కొనసాగించిన సందర్భాలున్నాయి. ఆవిడ ఇంగ్లిష్ పల్ప్‌తో రాస్తారంటూ ఆక్షేపించిన వారున్నారు. ఏదైనా కావచ్చు చదివించే గుణం కదా ముఖ్యం. ఆమె నవలల్లో అడుగు పెడితే విమానం లాంటి కార్లు, అందమైన డ్రాయింగ్ రూమ్‌లు, ఆరడుగుల శేఖర్, సరిజోడు జయంతి లేదంటే ఇంకో ఇంతి – కాసేపటికి కలల్లోకి జారుకుంటాం. 1960 దశకంలో మధ్యతరగతి అమ్మాయిలు చాలా ఇష్టపడటానికి కారణం వాతావరణంలో ఉండే రిచ్‌నెస్. దానికి సస్పెన్స్ తోడయ్యేది. పాతికేళ్ల పాటు ఎడిటర్లు, పబ్లిషర్లు, చిత్ర నిర్మాతలు సులోచనారాణి రాతల కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. రీడర్స్ తగ్గి వ్యూయర్స్ పెరిగాక, వీక్షకుల్ని సైతం విపరీతంగా ఆమె ఆకట్టుకున్నారు. సుమారు పది మెగా టీవీ సీరియల్స్‌కి మూలకథ సులోచనారాణిదే. సెక్రటరీ నుంచి చాలా సినిమాలు ఆమె నవలల పేరుతోనే వచ్చాయ్. ప్రతి ఏటా వేసవిలో కుమార్తె వద్దకు వెళ్లి కొద్ది నెలలు గడపడం అలవాటు. అలాగే వెళ్లిన సులోచనారాణి, యుఎస్ క్యుపర్టినో సిటీలో స్వీయ కథ ముగించి ఫుల్స్టాప్ పెట్టేశారు. తెలుగు జాతి ఆమెకు రుణపడి ఉంటుంది. అక్షర నివాళి.
శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)