కాలం కాకపాయె!
వరుణుడి కరుణ కరువు
నీళ్లు లేక చెరువులు వెలవెల
నంగునూరులో కరువుఛాయలు
అడుగంటిన భూగర్భ జలాలు
నంగునూరు: కార్తెలు కరుగుతున్నా కాలం కాకపాయె.. నిత్యం వర్షాలు పడ్డా బావుల్లోకి నీరు రాదాయె.. అంటూ రైతులు వాపోతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు పొంగి చెరువులు, బావులు నిండుతున్నా.. నంగునూరు మండలంలో పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా చెరువుల్లో నీళ్లు లేక వెలవెల పోతున్నాయి.
ఎక్కడా చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. వర్షా కాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా మండలంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో అన్న దాతల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇలాగే ఉంటే సంవత్సరం పొడవునా తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం వర్షాలు లేక చెరువులు, బావులు ఎండి పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సంవత్సరం జూన్ మాసంలోనే తొలకరి పలకరించడంతో ఈసారి బాగా వర్షాలు పడి సంమృద్ధిగా పంటలు పండుతాయని అన్నదాతలు ఆశించారు. దీంతో మండలంలోని చాల గ్రామాల్లో రైతులు బీడు భూములను సహితం దుక్కులు దున్ని మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యపు పంటలతో పాటు వరిని సాగు చేశారు. జూన్ నుంచి ఆగస్టు నెల వరకు సాధారణ వర్షపాతం నమోదు కావడం, అడపాదడపా వర్షాలు పడ్డా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరక పిచ్చిమొక్కలతో నిడిపోయాయి.
భారీ వర్షాలు కురువకపోవడంతో భూగర్భ జలాలు పెరుగక బావుల్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం వేసిన పంటలకు ఢోకా లేకున్నా భారీ వర్షాలు పడకుంటే వచ్చే రబీ పంటకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే జూన్ మాసంలో మొక్కజొన్న పంటలకు సరైన సమయంలో నీరందక చాలా గ్రామాల్లో పంటంతా ఎండిపోయింది. దీంతో 40 శాతం పంటకు నష్టం వాటిళ్లింది.
సాధారణ వర్షపాతమే
నంగునూరు మండలంలో అధికారుల లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం జూన్ నెలలో 109 శాతం నమోదు కావాల్సి ఉండగా 109.02, జూలై నెలలో 200గానూ.. 251.02, ఆగస్టు మాసంలో 160.0 శాతానికి గాను కేవలం 101.08 శాతం వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మరో నెల రోజుల్లో ముగియనుండడంతో నెలరోజుల్లో కురిసే వర్షాలపైనే అన్నదాతల ఆశలు పెట్టుకున్నారు. ఈ యేడు కాలం కాకుంటే దీని ప్రభావం వచ్చే వర్షకాలం వరకు ప్రభావం చూపుతుంది.
బీడు భూములను తలపిస్తున్న చెరువులు
గత సంవత్సరం సరిగా వర్షాలు పడకపోవడంతో చెరువులు, బావుల్లో నీళ్లులేక ఎండిపోయాయి. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడక చెరువుల్లో నీళ్లు లేక వెలవెల బోతున్నాయి. మండలంలోని చాలా గ్రామాల్లో బీడు భూములే దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట డివిజన్‌లోనే రెండో పెద్ద చెరువైన రాజగోపాల్‌పేట తటాకంలోకి చుక్క నీరు రాలేదు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీసినా వర్షాలు లేక పిచ్చిమొక్కలు పెరిగాయి. వరుణుడు కరుణించి సెప్టెంబర్ మాసంలో వానలు కురిపిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుంది.