టాటా నానో.. సీఎన్జీ కారు రెడీ!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ నానో మోడల్లో డ్యుయల్ ఫ్యూయల్(పెట్రోల్, సీఎన్జీ) వేరియంట్, నానో సీఎన్జీ ఈమాక్స్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.2.40 లక్షలు-రూ.2.65 లక్షల రేంజ్లో నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. అధిక వేగం అవసరమైనప్పుడు సీఎన్జీ నుంచి పెట్రోల్ ఇంధనానికి మారేలా ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎంఎస్) ఈ నానో ప్రత్యేకత అని వివరించింది.
ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, లక్నోల్లో ఈ కొత్త వేరియంట్ లభిస్తుందని పేర్కొంది. ప్రారంభం నుంచే నానో సంచలనం సృష్టిస్తోందని, ఈ కొత్త వేరియంట్ ఆ సంచలనానికి జత అయిందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్-కమర్షియల్) అంకుష్ అరోరా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకూ మొత్తం 10,202 నానో కార్లను టాటా మోటార్స్ విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మొత్తం 39,623 నానో కార్లు అమ్ముడయ్యాయి.