టీడీపీ వాళ్లు నన్ను అవహేళన చేశారు.. వారికి ఒకటే చెబుతున్నా!
సాక్షి, నరసరావుపేట: బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కు పంపే బాధ్యత పల్నాడు జిల్లా ప్రజలదేనని నరసరావుపేట లోక్‌సభ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తొలిసారి జిల్లాలో అడుగిడిన సందర్భంగా బుధవారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగనన్న ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి వచ్చే సమయంలో చాలా బాధపడ్డా.. మనసుకు భారంగా అనిపించిందన్నారు. కానీ పల్నాడు జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలతో పలికిన స్వాగతం చూసి చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి సహకారంతో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచి మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఓ గొర్రెల కాపరికి మంత్రి పదవి ఇచ్చారని టీడీపీ వారు నన్ను అవహేళన చేశారు.
వారికి ఒకటే చెబుతున్నా.. శ్రీకృష్ణుడు గొర్రెలకాపరి, ఏసుప్రభు పుట్టింది గొర్రెల చావడిలో అని గుర్తుంచుకోండి. నారా భువనేశ్వరి తన ఆస్తిలో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తుందన్నారు. అంటే వారి ఆస్తి సుమారు రూ.20 వేల కోట్లు. ఇదంతా ఆవులు, గేదేలు కాసే బీసీ బిడ్డలు పాలు పితికి మీకు పోస్తేనే సంపాదించారని గుర్తుచేశారు. కోటప్పకొండ శివయ్య సాక్షిగా చెబుతున్నా జగనన్న నన్ను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు.. ప్రతీ అడుగులో అండగా నిలిచారన్నారు. తక్కువ సమయంలో ఉండటంతో వీలైన ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేస్తానని, ఎవరైనా కలవలేకపోతే 5 ఏళ్లు ఎంపీగా ఉన్న సమయంలో కలుస్తానన్నారు.
భారీ జోష్..
అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో అడుగుపెట్టిన సమయం నుంచి బహిరంగసభ ముగిసే వరకు కార్యకర్తల్లో భారీ జోష్ కనిపించింది. అనిల్‌కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. అనిల్ ప్రసంగించే సమయంలో యువత కేకలతో సభ దద్దరిల్లింది. కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, నాగార్జున యాదవ్, ఖలీల్ అహ్మద్, నిమ్మకాయల రాజనారాయణ, యనుముల మురళీధర్‌రెడ్డి, గజ్జల నాగభూషణం రెడ్డి పాల్గొన్నారు.
జగనన్న బాణం అనిల్..
జగనన్న వదిలిన బాణం అనిల్‌కుమార్ యాదవ్. అనిల్ పేరు ప్రకటనతో జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. నెల్లూరు వారికి నరసరావుపేట ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలను ఎంపీగా గెలిపించిన చరిత్ర ఉంది. అనిల్ ఎంపీగా గెలవడంతోపాటు మేం ఏడు మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తాం. – నంబూరు శంకరరావు, ఎమ్మెల్యే
ఇవి చదవండి: ‘పోలవరం’ ఆలస్యానికి చంద్రబాబే కారణం!