కక్షగట్టి మహిళపై కత్తితో దాడి
యాకుత్‌పురా: పాత గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణ్‌బాగ్ ప్రాంతానికి చెందిన షౌకత్ అలీ, ఫరీదా బేగం (50) దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. కొన్ని నెలల క్రితం షౌకత్ అలీ చనిపోవడంతో ఫరీదా బేగం ఇద్దరు కూతుళ్ల వివాహం అనంతరం నారాయణ్‌బాగ్‌లోని రెహమాన్‌కు చెందిన ఇంట్లో అద్దెకుంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది.
కాగా, ఫరీదా బేగం ఉంటున్న అద్దె ఇంటి పక్క గదిలో జావేద్ (22) కుటుంబం నివసిస్తోంది. ఫరీదా బేగం, జావేద్ కుటుంబాల మధ్య నీటి సమస్యపై పలుమార్లు గొడవలు తలెత్తడంతో ఇంటి యజమాని కొన్ని నెలల క్రితం జావేద్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. అందుకు కారణమైన ఫరీదాబేగంపై కక్షగట్టిన జావేద్ ఆదివారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కొసేందుకు యత్నించగా ఫరీదా ప్రతిఘటించి అరవడంతో గాయపరిచి పరారయ్యాడు. గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారని ఇన్స్పెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎస్సై లక్ష్మయ్యలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు.