దర్యాప్తు మిస్సింగ్
అనంతపురం జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పెద్దన్నకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒకరైన శిల్ప కర్నూలు దేవనగర్లోని నారాయణమ్మ వసతిగృహంలో ఉంటూ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. డిసెంబర్ 21, 2012న కాలేజీకి వెళ్లిన ఈ యువతి అదృశ్యమైంది. జనవరి 2, 2013న తల్లిదండ్రులు కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అదే కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్న చిట్టిబాబుపై అనుమానం వ్యక్తం చేసినా.. ఇతను కానిస్టేబుల్ కుమారుడు కావడంతో దర్యాప్తును తొక్కిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిల్ప తల్లిదండ్రులు నవంబర్ 11, 2013న ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించారు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీ వీడకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అదృశ్యం కేసుల్లో పోలీసుల అలసత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
కర్నూలు, న్యూస్‌లైన్: మతిస్థిమితం సరిగా లేకపోవడం..చదువుపై అనాసక్తి.. ప్రేమించిన వారిని విడిచి ఉండలేకపోవడం.. కారణం ఏదైతేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయేవారు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. అయితే వాటిని ఛేదించడంలో ఆ శాఖ సిబ్బంది ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో గతేడాది 119 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
గత నాలుగేళ్లలో 388 మంది మహిళలు తప్పిపోగా తిరిగి ఇళ్లకు చేరుకున్న సంఖ్య అంతంత మాత్రమే. కేసు నమోదు చేసుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప విచారణపై పోలీసులు ఆసక్తి చూపడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో వివాహితలు ఎక్కువగా కనిపించకుండా పోతున్నారు. పట్టణాల్లో ఉపాధి కల్పిస్తామని ఆశ పెట్టి కొందరు దళారులు వ్యభిచార కూపంలోకి మహిళలను నెడుతున్నారు. వివిధ కారణాల రీత్యా ఇంటి నుంచి బయటికి వెళ్లి అష్టకష్టాలు పడి కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యుల శ్రమతో ఇంటికి చేరుతున్నారు.
పోలీసులు విచారణ జరిపి తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల నుంచి పరారీ అవుతున్నారు. గత నాలుగేళ్లలో 364 మంది ఆడపిల్లలు తప్పిపోగా 324 మంది తిరిగి ఇంటికి చేరుకున్నారు. 40 మంది బాలికలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.