Narsarao pet
-
ఎంత పని చేశావ్.. తల్లీ! పోలీసులను పరుగులు పెట్టించి చివరికీ..
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: నరసరావుపేటలో కనిపించకుండాపోయిన ఏడాది బాలుడు బావిలో శవమై తేలాడు. కిడ్నాప్ అయ్యాడని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పరుగులు పెట్టిన పోలీసులు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాప్ జరగలేదని నిర్ధారించుకున్నారు. అనుమానంతో తల్లిని ప్రశ్నించగా.. పిల్లాడిని ఆడిస్తుండగా పొరపాటున బావిలో పడిపోయాడని తెలిపింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. బావి నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలేనికి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు కుమార్తె మోక్ష, కుమారుడు భానుప్రకాష్ (1) ఉన్నారు. కాగా, వాసు, సాయిలక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఏడాది కుమారుడు భానుప్రకాష్ కనిపించడం లేదని తల్లి సాయిలక్ష్మి తన భర్త, బంధువులకు సమాచారం అందించింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తండ్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట్రుకలు కొనుగోలు చేసే వ్యక్తులు శుక్రవారం రెక్కీ నిర్వహించారని, శనివారం సాయంత్రం తమ బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును తక్షణమే అక్కడికి బదిలీ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ సీఐ ప్రభాకర్ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. దాదాపు 60 సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలుడి ఆచూకీ ఎక్కడా నమోదు కాలేదు. తల్లిని ప్రశ్నించడంతో.. బాలుడు భానుప్రకాష్ ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బాలుడి తల్లి సాయిలక్ష్మిని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రహరీపై ఆడుకుంటున్న బాలుడు కిందకు జారి పాత బావిలో పడిపోయాడని సాయిలక్ష్మి తెలిపింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారోనన్న భయంతో చెప్పలేదని భోరున విలపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు బావిలో వెతకగా బాలుడి మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలుడి తల్లి సాయిలక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. మొదటి కాన్పు సమయంలోనే ఆమె మానసిక సమస్య రావడంతో చికిత్స అందిస్తున్నట్టు భర్త తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష్మి తల్లిదండ్రులు క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చిన్నారి తన చేతుల్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ఆమె భయపడి బాలుడు కనిపించడం లేదని భర్త, బంధువులకు చెప్పిందని ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి) -
కాశీ యాత్రలో విషాదం
నరసరావుపేట : గుంటూరు జిల్లా నుంచి కాశీకి బయలుదేరిన యాత్రికుల ప్రైవేటు బస్సు ఒడిశా రాష్ట్రంలోని కటక్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసరావుపేట పట్టణానికి చెందిన రాజవరపు రామతులశమ్మ (63) మృతి చెందగా , మరికొందరికి గాయాలయ్యాయి. యాత్రకు నాయకత్వం వహిస్తున్న జయమ్మ ఈ నెల 2 0వ తేదీ రాత్రి నరసరావుపేట పట్టణంతో పాటు రొంపిచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన 40 మందితో ప్రైవేటు బస్సులో కాశీకి బయలు దేరారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి బస్సులో లోయలో పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన కర్రి సీతారావమ్మ తీవ్రంగా గాయపడింది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షేమంగా తీసుకొస్తున్నాం: ఆర్డీవో సంఘటన జరిగిన ప్రదేశం నుంచి రామతులశమ్మ భౌతికకాయంతో పాటు గాయపడిన వారందరినీ క్షేమంగా నరసరావుపేటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో ఎం.శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికారులను అప్రమత్తం చేశారన్నారు. కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒడిశా రాష్ట్రంలోని ఖాజాపూర్ కలెక్టర్ సత్యకుమార్ మల్లిక్, రసూల్పూల్ తహశీల్దార్ అరుణ్‌కుమార్ బెహరాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారన్నారు. అక్కడి డీఎస్పీ పర్యవేక్షణలో ఒక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. మృతురాలి భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో నరసరావుపేటకు తీసుకొస్తున్నారని, మిగతా యాత్రికులను కటక్ నుంచి విజయవాడకు దివాకర్ ట్రావెల్స్ బస్సులో బుధవారం తెల్లవారుజామున విజయవాడకు వస్తున్నట్లు చెప్పారు. కాగా అమెరికాలో ఉన్న వైఎస్సార్ సీపీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వర సహాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
నర్సారావుపేట టౌన్: గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాత పశువులసంత వైపు నుంచి స్కూటీపై ముగ్గురు ఎన్ఆర్టీ సెంటర్ వైపు వస్తుండగా మూలమలుపు వద్ద లారీ ఢీకొంది. దీంతో స్కూటీ నడుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి రాజ్‌కుమార్ (19), ఏడవ తరగతి విద్యార్థి కె.వాసుదేవనాయక్ (14) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఖాజా (14) అనే మరో విద్యార్థి స్వల్ప గాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడ్ని నర్సారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఉద్రిక్తతల నడుమ 'జన్మభూమి' వాయిదా
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావు పేటలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్లెక్సీలు ఉంచడంపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలను తొలగించాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు తొలిగించమని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ప్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నతాధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మరింది. జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. -
గుంటూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్
హైదరాబాద్: గుంటూరు జిల్లా నర్సారావు పేటలో జాన్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. సోమవారం సాయంత్రం జాన్ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా దుండగులు అపహరించారు. బాలుడిని విడిచిపెట్టేందుకు ఐదు లక్షల రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు కిడ్నాప్ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.