గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావు పేటలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్లెక్సీలు ఉంచడంపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలను తొలగించాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు తొలిగించమని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ప్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు.
దీన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నతాధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మరింది. జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.