ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?
విజయనగరం : మా ఊరుకు ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది. సోమవారం విజయనగరం జిల్లా ఎ రావివలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు.
అనంతరం గూడెపువలస గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మాట్లాడే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ క్రమంలో నర్సాయమ్మ మాట్లాడుతూ....తాము ఇద్దరం అక్కాచెల్లిళ్లమని... తనకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తామకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని తెలిపారు.
ఆ భూమే తమకు జీవనాధారమన్నారు. ఈ భూమిని కూడా తీసుకుంటే తమకు జీవనోపాధి కోల్పోతామని ఆమె కన్నీటిపర్యంతమైయ్యారు. మాకు ఎయిర్పోర్ట్ వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది. కావాలంటే ప్రాణాలైన ఇస్తాం కానీ... భూములు మాత్రం ఇవ్వమని నర్సాయమ్మ తెలిపింది.