అల్కాయిదా అగ్ర నేత నాసిర్ హతం
దుబాయి: అల్కాయిదాలో రెండో కీలకమైన నేతగా పేరుపొందిన నాసిర్ అల్-ఉహాయషి అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో మరణించాడు. ఈ విషయాన్ని అల్కాయిదా మంగళవారం నిర్ధారించింది. ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో సతమతమవుతున్న అల్కాయిదాకు ఇటీవలి నెలల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత.. ఆ సంస్థకు అత్యంత భారీ ఎదురుదెబ్బగా నాసిర్ హతమవడాన్ని పరిగణిస్తున్నారు. అరేబియన్ ద్వీపకల్పంలోని అల్కాయిదా(ఏక్యూఏపీ) నాసిర్ మరణాన్ని నిర్ధారిస్తూ.. ఈ నెల 9న అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో అతనితోపాటు మరో ఇద్దరు ముజాహిదీన్లు చనిపోయారని తెలిపింది. కాగా తమ కొత్త అధిపతిగా ఖాసీం అల్ రిమి నియమితుడైనట్టు ఏక్యూఏపీ తెలిపింది.