బెంగళూరు రేప్ కేసులో బీఎస్పీ నేత కుమారుడు
బెంగళూరు : బెంగళూరులో పీజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు హైదర్ నాజీర్ బహుజన సమాజ్ వాదీ పార్టీ నేత కుమారుడుగా సమాచారం. నిందితుడు స్థానిక బీఎస్పీ నేత బహుదుర్ కుమారుడుగా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడు హైదర్ నాజీర్ అరెస్ట్ చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. పోలీసుల పేరుతో బెదిరించి యువతి, యువకుడిని కారులో బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆయన అన్నారు. అనంతరం యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించి సున్నితమైన ప్రాంతాల్లో గాయపరిచారని తెలిపారు.
అక్కడి నుంచి కాక్స్టౌన్ లోని రైలు పట్టాల దగ్గరకు తీసుకు వచ్చి రూ.50వేలు ఇవ్వాలని ఇద్దరిపై దాడికి దిగారు. నగదు లేదని చెప్పటంతో యువకుడి వద్ద నుంచి విలువైన రిస్ట్ వాచ్ లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారని ఔరాద్కర్ తెలిపారు. కేసు వివరాలు తెలిసినా దర్యాప్తు చెయ్యడంలో నిర్లక్ష్యం చేసిన పులకేశీ నగర పోలీస్ స్టేషన్ సీఐ సహా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఔరాద్కర్ పేర్కొన్నారు.