2025 నాటికి ఐటీ ఉత్పత్తుల వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ ఉత్పత్తుల రంగం వేగంగా విస్తరిస్తోందని, 2025 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. దేశంలో 10,000కి పైగా ఐటీ ఉత్పత్తుల స్టార్టప్ కంపెనీలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, వీటికి తగినంత నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని నాస్కామ్ ప్రోడక్ట్ కౌన్సిల్ చైర్మన్ రవి గురురాజ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ‘నాస్కామ్ ప్రోడక్ట్ కాన్క్లేవ్ 2014’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కనీసం 100 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా సిలికాన్ వ్యాలీ సందర్శించడానికి 25 కంపెనీలను ఎంపిక చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ ప్రోడక్టు కంపెనీలు ఊహించని వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెయైంట్ (ఇన్ఫోటెక్) చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 3,500కిపైగా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీలు పరిపక్వ దశకు చేరుకున్నప్పటికీ వాటి విలువ చాలా తక్కువగా ఉందన్నారు. సగం స్టార్టప్ కంపెనీల విలువ 10 మిలియన్ డాలర్లలోపే ఉందన్నారు. కాని ఇప్పుడు అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో ఈ కంపెనీలు తట్టుకొని నిలబడగలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.