ఆలోచింపజేసిన ‘గుర్తుతెలియని శవం’
శ్రీకాళహస్తి టౌన్ : పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నతపాఠశాలలో జరుగుతున్న 16వ వార్షిక తెలుగుభాషా నాటకోత్సవాలల్లో భాగంగా చివరిరోజు ప్రదర్శించిన ‘గుర్తు తెలియని శవం’ నాటకం ఆలోచింపజేసింది. డబ్బు మానవుని జీవితాన్ని ఎలా శాసిస్తుందో కళ్లకు కట్టింది. చివరిరోజు ఆదివారం బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆయన మాట్లాడుతూ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు నాటకోత్సవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. తెలుగును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాటకోత్సవాల సందర్భంగా పట్టణానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అలరించిన ప్రదర్శనలు
ఈ సందర్భంగా విజయవాడకు చెందిన జనశ్రేణి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘గుర్తు తెలియని శవం’ సాంఘిక నాటిక ఆలోచింపజేసింది. డబ్బు ఆ«ధునిక మానవుని జీవితాన్ని ఎలా శాసిస్తుందో, పేదరికం మనుషుల మధ్య ఆప్యాయతాను రాగాలను చంపి సంఘర్షణలకు, ఆత్మహత్యలకు ఎలా దారి చూపుతుందో ఈ నాటిక కళ్లకు కట్టినట్లు చూపింది.
అలాగే, తెనాలికి చెందిన శ్రీ దుర్గా భవాని నాట్యమండలి ప్రదర్శించిన శ్రీకృష్ణ పారిజాతం పద్యనాటకం ప్రేక్షకులను అలరించిం ది. అనంతరం కళాపరిషత్ అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కోలా ఆనంద్‌ను ఘనంగా సత్కరించారు. కళాకారులకు నటరాజ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాసులు, సుజాతమ్మ, రాధాకృష్ణ, గణేష్, సంపత్‌కుమార్, వెంకటయ్య, సుబ్బారెడ్డి, మాధవనాయుడు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.