కథ పాతదే... కొత్తగా 'భాయ్' !
తెలుగు చలన చిత్ర సీమలో ఇటీవల కాలంలో ఏ నటుడు చేయనన్ని ప్రయోగాలు చేసి అక్కినేని నాగార్జున అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, షిర్డి సాయిబాబా లాంటి చిత్రాలు నటుడిగా నాగార్జున అభిరుచికి, తపనకు అద్దపట్టాయి. నాగార్జున టెస్ట్ కు అనుగుణంగా టాలీవుడ్ లో దర్శకులు కూడా ఆయననొక ప్రయోగశాలగా చేసుకున్నారు. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేయడం శివతో ప్రారంభించి.. ఇంకా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఎప్పటికప్పడూ ట్రెండ్ బేరీజు వేసుకుంటూ తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నాగార్జున తాజాగా వీరభద్ర చౌదరీ దర్శకత్వంలో భాయ్ గా ఓ ఢిఫెరెంట్ లుక్, స్టైల్ తో ముందుకు వచ్చాడు. ఇప్పటికే దర్శకుడు వీరభద్ర చౌదరీ రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుని.. హ్యట్రిక్ ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో భాయ్ చిత్రం ద్వారా ముందుకు వచ్చాడు. అత్తారింటికి దారేది ద్వారా సూపర్ హిట్ ఆడియోను అందించిన దేవి శ్రీ ప్రసాద్, నాగార్జున, వీరభద్ర చౌదరీ కాంబినేషన్ లో వచ్చిన భాయ్ ఎలా ఉన్నాడో చూసొద్దాం!
హంకాంగ్ లో మాఫియా కార్యక్రమాలు నిర్వహించే డాన్ (ఆశిష్ విద్యార్ధి)కు విజయ్ అలియాస్ భాయ్ (నాగార్జున) ఎల్లవేళలా కుడిభుజంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలకు అండర్ కవర్ ఆపరేషన్ తో అడ్డుతగిలిన పోలీసాఫిసర్ (ప్రసన్న)ను మట్టుపెట్టడానికి భాయ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు. అండర్ కవర్ ఆపరేషన్ తో మాఫియాకు అడ్డుతగిలిన పోలీసాఫిసర్ తన తమ్ముడే అని తెలుసుకోవడం ఇంటర్వెల్ ట్విస్ట్. తండ్రి కోసం చేయని నేరాన్ని తనపై వేసుకుని కుటుంబానికి దూరంగా బతుకుతున్న విజయ్, డాన్ కోసం తమ్ముడి చంపుతాడా? లేక మాఫియా బారి నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం డాన్ కు ఎదురు నిలిస్తాడా? తన కుటుంబాన్ని మాఫియా ఎలా రక్షించుకుని ... తండ్రికి ఎలా దగ్గరయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'భాయ్'.
భాయ్ గా నాగార్జున మరోసారి చాలా ఫ్రెష్ గా కనిపించాడు. క్యాస్ట్యూమ్స్, న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు. భాయ్, విజయ్, వెడ్డింగ్ ప్లానర్ లాంటి మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. ఇలాంటి పాత్రలు పోషించడం కెరీర్ లో నాగార్జున లాంటి స్టార్ కు కొట్టిన పిండే. భాయ్ గా కొత్త లుక్ తో కనిపించిన నాగ్ అభిమానుల్లో ఆనందం నింపాడు.
హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయకు మరోసారి ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. రిచా కెరీర్ కు ఎలాంటి ఉపయోగపడదని చెప్పవచ్చు. అతిధి పాత్రలో కామ్న జెఠ్మలానీ మెప్పించలేకపోయింది. నటాలియా కౌర్, హంసా నందిని ఐటమ్ సాంగ్స్ తో ఆలరించారు.. నాగార్జున తండ్రిగా నాగినీడు, తమ్ముడిగా తమిళ నటుడు (ఫైవ్ స్టార్ ఫేం), నటి స్నేహ భర్త ప్రసన్న పోలీసాఫిసర్ గా తమ పాత్రల మేరకు పరిమితమయ్యారు. డాన్ గా కొడుకులుగా సోన్ సూద్, అజయ్ లు నటించారు. మాన్షన్ రాజుగా ఎమ్మెస్, విక్రం డోనర్ గా బ్రహ్మనందం, వదిలేయ్ బాబాగా రఘుల కామెడీ పర్వాలేదనిపించింది.
అత్తారింటికి దారేది హిట్ తో మంచి ఊపు మీద ఉన్న దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంలో ఆయన మార్కు కనిపించలేదనే చెప్పాలి. అయితే రీరికార్డింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్ గా నిలిచింది. మమతా మోహన్ దాస్ పాడిన 'మోస్ట్ వాంటెడ్', భాయ్ టైటిల్ సాంగ్, రామసక్కనోడు మాస్ అకట్టుకునేలా ఉంటే..నెమ్మదిగా నెమ్మదిగా అనే పాట మెలోడియస్ గా సాగింది.
ఇక దర్శకుడు వీరభద్ర చౌదరీ వరస హిట్లతో హ్యట్రిక్ కోసం భాయ్ తో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే పంచ్ డైలాగ్స్, స్టైలిష్ గా తీయాలనే తాపత్రయంలో అసలు కథను పక్కన పెట్టడమే కాకుండా.. పేలవమైన స్క్రీన్ ప్లే ను అందించాడు. మంచి బ్యానర్, భారీ తారాగణంలాంటి అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమైనారనే చెప్పవచ్చు. రొటిన్ కథ తో కొత్త గ్లాస్ లో పాత సారాను అందించాడనే అపవాదును మూటగట్టుకోవచ్చు. మలయాళ చిత్రం ''పోకిరి రాజా'' ఆధారంగా రూపొందిన అక్షయ్ కుమార్ 'బాస్' చిత్రానికి 'భాయ్' కథ చాలా దగ్గరగా ఉంది. ఏది ఏమైనా పాత కథతో రూపొందించిన భాయ్ చిత్రం విమర్శల ప్రశంసలకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మాస్, క్లాస్ ప్రేక్షకుల ఆదరణ మేరకే భాయ్ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.