National boxing competition
-
తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్‌కు స్వర్ణం
జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ బంగారు పతకం సాధించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అతను సర్వీసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 4–1తో సచిన్ (రైల్వేస్)ను ఓడించాడు. హిస్సార్‌లో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో సర్వీసెస్ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. ఈ జట్టుకు చెందిన బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలున్నాయి. భారత మేటి బాక్సర్ శివ థాపా (అస్సామ్) స్వర్ణం సాధించాడు. 63.5 కేజీల ఫైనల్లో అతను అంకిత్ నర్వాల్ (రైల్వేస్)పై గెలుపొందాడు. సర్వీసెస్ బాక్సర్లలో విశ్వామిత్ర చాంగ్తామ్ (51 కేజీలు), సచిన్ (51 కేజీలు), ఆకాశ్ (67 కేజీలు), సుమిత్ (75 కేజీలు), వాకోవర్‌తో నరేందర్ (ప్లస్ 92 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. -
ఫైనల్లో శివ థాపా, తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్
హిస్సార్: జాతీయ సీనియర్ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు శివ థాపా ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న థాపా (63.5 కేజీల విభాగం) సెమీ ఫైనల్లో 5–0తో మనీశ్ కౌశిక్ (సర్వీసెస్)ను చిత్తు చేశాడు. ఫైనల్లో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)తో థాపా తలపడతాడు. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కూడా 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరాడు. సర్వీసెస్ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్ సెమీస్‌లో 5–0తో ఆశిష్ కుమార్ (హిమాచల్ ప్రదేశ్)పై ఘన విజయం సాధించాడు. ఇతర కేటగిరీల్లో సంజీత్, నరేందర్, సాగర్ కూడా తుది పోరుకు అర్హత సాధించారు. -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిజామాబాద్ అమ్మాయి
సాక్షి, నిజామాబాద్: మహిళల సీనియర్ జాతీయ బెస్ట్ బాక్సర్ ఛాంపియన్షిప్ విజేతగా నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ నిలిచింది. హర్యానాలోని హిస్సార్‌లో ఈ నెల 21 నుంచి టోర్నమెంట్ నడుస్తోంది. బుధవారం టోర్నీ ఫైనల్ ముగిసింది. హర్యానాకు చెందిన మీనాక్షిని జరీన్ 4–1 తేడాతో ఓడించింది. మొదటి రౌండ్లో గోవాకు చెందిన దియా వాల్కేను నాకౌట్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఒడిశాకు చెందిన సంధ్యారాణిని 5–0 తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజును 5–0 తేడాతో ఓడించింది. ఫైనల్లో మీనాక్షిపై విజయం సాధించింది. వచ్చే డిసెంబర్ రెండోవారంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగనున్న మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీకి జరీన్ ఎంపికైంది. 2014లో ఇస్తాంబుల్‌లో జరిగిన జూనియర్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా జరీన్ నిలిచింది. నిజామాబాద్‌కు చెందిన సమ్‌సమ్ జరీన్‌కు కోచ్‌గా ఉన్నారు. నిఖత్ జరీన్‌ను, ఆమె కోచ్ సమ్సమ్ను మాజీ 400, 800 మీటర్ల నేషనల్ మెడలిస్ట్ సయీద్ ఖైసర్ అభినందించారు. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
బాక్సర్ ప్రసాద్‌కు స్వర్ణం
పుణే: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా (పీఎల్) ప్రసాద్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ప్రసాద్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రసాద్ 3–2తో అనంత చోపాడే (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. వైజాగ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రసాద్ 2015లో 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రపంచ యూత్, ఆసియా యూత్ బాక్సింగ్ పోటీల్లో భారత్‌కు కాంస్య పతకాలను అందించాడు. ఈసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ తరఫున ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది బాక్సర్లు స్వర్ణాలు గెలవడం విశేషం. ఓవరాల్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న సర్వీసెస్‌కు మనీశ్ కౌశిక్ (60 కేజీలు), మదన్‌లాల్ (56 కేజీలు), సంజీత్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దీపక్ (49 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), మంజీత్ సింగ్ (75 కేజీలు) కూడా పసిడి పతకాలు అందించారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు మహాలక్ష్మి ఎంపిక
మామిడికుదురు : ఆలిండియా బాక్సింగ్ పోటీలకు మలికిపురానికి చెందిన ఎస్.మహాలక్ష్మి ఎంపికైనట్టు బాక్సింగ్ కోచ్ బొంతు మధుకుమార్ శుక్రవారం తెలిపారు. అంతర్ కళాశాలల విశ్వవిద్యాలయాల స్థాయిలో విజయవాడ ఆర్కే ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం జరిగిన అర్హత పోటీల్లో ప్రతిభ ఆధారంగా మహాలక్ష్మిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి పిభ్రవరి 2 వరకు పంజాబ్‌లో జరిగే పోటీల్లో ఈమె పాల్గొంటుందని వెల్లడించారు. మహాలక్ష్మి స్థానిక నవయువ క్రీడా యువజన సేవా సంఘం ఆ ధ్వర్యంలో బాక్సింగ్‌లో శిక్షణ పొందిందని, ఈమె ప్రస్తు తం విజయవాడలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోందని, వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ని పలువురు అభినందించారు.