లక్ష కి.మీ. పరిధిలో హరిత రహదార్లు:గడ్కారీ
10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల వెంట లక్ష కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ శుక్రవారం పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్ కింద 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు, అంతేకాక రహదారుల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించనున్నట్లు చెప్పారు. 1,500 కిలోమీటర్ల పరిధిలో ఈ మిషన్ కోసం తక్షణమే రూ.300 కోట్లను వెచ్చించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టార్టప్‌ను గడ్కారీ ఆహ్వానించారు. 2019 లోగా రూ.5 లక్షల కోట్లను జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నామని.. అందులో 1 శాతం రూ.5 వేల కోట్లను ‘పచ్చ పందిర్ల’ ఏర్పాటుకు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం ఒక కిలోమీటరు పరిధిలో మొక్కల పెంపకం ద్వారా 10 మంది ఉపాధి పొందవచ్చని, మొత్తం 1,500 కి.మీ. పరిధిలో 15,000 మందికి ఈ పథకంతో ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ పథకంలో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.