National Highway -216
-
ఇది జాతీయ రహదారా?
పశ్చిమగోదావరి,ఆకివీడు: జిల్లాలో జాతీయరహదారి 216పై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు వంతెన వద్ద నుంచి ఆకివీడు ప్రధాన సెంటర్ వరకూ జాతీయరహదారి పలు చోట్ల చెరువుల్ని తలపిస్తుంది. భారీ వర్షాలకు రహదారి పూర్తిగా మునిగిపోయింది. పలుచోట్ల గుంతలు పడి ద్విచక్ర వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి పూట ఈ ప్రాంతంలో వాహనంపై ప్రయాణిస్తే అంతే సంగతులని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారికి కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన పక్కా డ్రెయిన్ అడ్రస్సు లేకుండా పోయింది. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలతో డ్రెయిన్‌ను పూడ్చివేశారు. ఇటీవల రహదారి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ వర్షం రావడంతో పనులు నిలిచిపోయాయి. రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఆక్రమణల్లో ఉన్న మార్జిన్లు తొలగించి, పక్కా డ్రెయిన్ సదుపాయం కల్పిస్తేనే వర్షంనీరు పారుదలకు మార్గం ఏర్పడుతుందని చెబుతున్నారు. డ్రెయిన్, మార్జిన్లలో ఉన్న మట్టి తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
అడుగడుగునా స్పీడ్బ్రేకర్లే..
అమలాపురం :జాతీయ రహదారి -216 విస్తరణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రహదారి విస్తరణతోపాటు జిల్లాలో ఏడు చోట్ల బైపాస్‌ల నిర్మాణం చేపటాల్సి ఉంది. దీని వల్ల పలుచోట్ల ఇళ్లు, వ్యాపార సముదాయాలు, భూములు కోల్పోతున్న వారు విస్తరణకు సంబంధించిన సర్వేపనులను అడ్డుకోవడం, రోడ్డెక్కి ఆందోళన చేయడం చూస్తుంటే పనులు పూర్తవుతాయనే నమ్మకం కలగడం లేదు. జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పాముర్రు వరకు గత ఎన్డీఏ హయాంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కృషితో ఈ జాతీయరహదారి నిర్మించారు. తిరిగి ఎన్డీఏ హయాంలో ఈ రహదారి విస్తరణకు అనుమతి రాగా, ఇటీవల రూ.మూడు వేల కోట్లు మంజూరైనట్టు సమాచారం. ఇప్పుడున్న ఏడు మీటర్ల రహదారిని మూడు మీటర్ల మేర విస్తరించి, పది మీటర్లు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పామర్రు నుంచి అవనిగడ్డ, రేపల్లె, గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా చీరాల మీదుగా ఒంగోలు వద్ద జాతీయ రహదారి- 16లో కలిసే ఈ రహదారి విస్తరణతో కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా సరుకు రవాణా మరింత వేగవంతమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల నుంచి మత్స్య, కొబ్బరి, ఇతర ఉత్పత్తులు ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు దగ్గరదారి అవుతుంది. రహదారి విస్తరణ సర్వే ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసి మే నుంచి పనులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మూడు ప్యాకేజీలుగా పనులు.. జిల్లాలోని కత్తిపూడి నుంచి దిండి- చించినాడ వంతెన వరకు విస్తరణ పనులను మూడు ప్యాకేజీలుగా చేశారు. కత్తిపూడి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి అనాతవరం, అనాతవరం నుంచి దిగమర్రు వరకు పనులు చేయనున్నారు. ఇప్పుడున్న రహదారిలో ఎక్కువగా ఉన్న మలుపులను తగ్గించేందుకు ఏరియల్ సర్వే చేశారు. పలు పట్టణాలు, మేజర్ పంచాయతీల మీదుగా రహదారి వెళ్లాల్సి రావడంతో స్థల సేకరణకు భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో పలుచోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్ నిర్ణయించింది. కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులో బైపాస్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. గతంలో పిఠాపురం, తాళ్లరేవు వద్ద బైపాస్‌లు పూర్తయ్యూరుు. పలు చోట్ల ఇళ్ల స్థలాలు, భూములు, వ్యాపార సముదాయాలు, ప్రముఖ ఆలయాలను తొలగించాల్సి ఉంది. ఇదే పలు వివాదాలకు కారణమవుతోంది. ఇవీ వివాదాలు.. అమలాపురం బైపాస్ రోడ్డును భట్నవిల్లి 93.3 కిలోమీటర్ల వద్ద ఆరంభించాలని ఎన్‌హెచ్ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు దీనిని కొంత ముందుకు తీసుకు వెళ్లడం వల్ల తమకు చెందిన ఐదు ఇళ్లు పోతున్నాయని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ మార్కండేయులు మంగళవారం పరిశీలించారు. కత్తిపూడి నుంచి నుంచి లెక్కిస్తే 100 కి.మీ. వద్ద టోల్‌ప్లాజా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పుడున్న రహదారికి అటు 70, ఇటు 70 మీటర్ల చొప్పున భూమి సేకరించాలని నిర్ణయించారు. ఇది అమలాపురం పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ నుంచి మేకల కాలువ వరకు నిర్మించాల్సి వస్తుంది. దీని వల్ల మూడు కాలనీల్లోని 100 ఇళ్లు, పాఠశాల, కళాశాల, రియల్ ఎస్టేట్ ప్లాట్లు పోతారుు. దీనికి బదులు బోడసకుర్రు వంతెన సమీపంలో ప్రభుత్వ స్థలాల వద్ద నిర్మించాలని స్థానికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనితో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ స్థలాలను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు విస్తరణ వల్ల రాజోలు దీవిలో వాణిజ్య కేంద్రమైన తాటిపాక స్వరూపం మారిపోతుంది. వ్యాపార సముదాయలు, ఇళ్లు పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుంది. దీని వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు తాటిపాక, మామిడికుదురు, నగరం వంటి చోట పెద్ద ఎత్తున ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానికులు బైపాస్ రోడ్డు నిర్మించాలని గతంలో నిరాహారదీక్షలు చేపట్టారు. దీనికి స్పందించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు స్థానికులను కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గ డ్కరీ వద్దకు తీసుకు వెళ్లి బైపాస్‌పై హామీ ఇప్పించారు. అయితే ఇప్పటికీ ఇక్కడ బైపాస్కు ఎన్‌హెచ్ నుంచి అనుమతి రాకపోవడం విశేషం. బైపాస్ ప్రతిపాదన దశలోనే ఉందని ఎన్‌హెచ్ వర్గాలు చెప్పడంతో స్థానికుల్లో ఆందోళన తొలగలేదు. ముమ్మిడివరం బైపాస్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చడం వల్ల తమ ఇళ్లు, ఇళ్ల స్థలాలను కోల్పోతామని, పెద్దల స్థలాలను రక్షించడం కోసం పేదలైన తమను నష్టపరచడం భావ్యం కాదని స్థానికులు నిరాహారదీక్షలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారి విస్తరణ ఎలా, ఎన్నటికి సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. -
కొసరు పనులు ఇంకెన్నాళ్లకు?
అమలాపురం :జాతీయ రహదారి-216లో వైనతేయ గోదావరిపై బోడసకుర్రు - పాశర్లపూడిల మధ్య తలపెట్టిన వంతెన ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దుగ్ధతో అప్పటి అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ గత మార్చి 8నే వంతెనను ప్రారంభించేసినా.. అప్రోచ్‌రోడ్డు.. రెయిలింగ్ వంటి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పనులు పూర్తి కాకుండానే ‘ప్రారంభించేసిన’ సమయంలో నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్న జాతీయ రహదారి సంస్థ, కాంట్రాక్టు సంస్థ గామన్ అధికారుల మాట నీటిమూటే అయింది. రూ.70.50 కోట్ల అంచనా వ్యయంతో 2006లో ఈ వంతెన నిర్మాణం మొదలైంది. నిర్ణీత గడువు ప్రకారం 2010 ఏప్రిల్ 25 నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వివాదాల కారణంగా పనులు తొలి నుంచీ మందకొడిగానే సాగాయి. ఈ ఏడాది మార్చి నాటికి వంతెన పనులు 90 శాతం పూర్తయ్యాయి. వంతెనపైరహదారి నిర్మాణం, ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు, రైలింగ్ పనులు మాత్రమే అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చినా, రాజకీయ ప్రయోజనం కోసం దాన్ని బేఖాతరు చేస్తూ అప్పటి ఎంపీ హర్షకుమార్ వంతెనను అనధికారికంగా ఆరంభించారు. అప్పటి నుంచీ మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లే కాక లారీల వంటి భారీ వాహనాలు కూడా వంతెన మీదుగా ప్రయాణిస్తున్నాయి. వంతెనపై రోడ్డు నిర్మాణం పూర్తయినా, అప్రోచ్‌రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పాశర్లపూడి వైపు రెయిలింగ్ పూర్తికాగా, బోడసకుర్రు వైపు పనులు ఇంకా మొదలు కాలేదు. అప్రోచ్‌రోడ్డు సైతం ఒక లేయర్ తారు మాత్రమే వేసి వదిలేశారు. అసంపూర్తి పనులను కేవలం వారం, పది రోజుల్లో పూర్తిచేసే అవకాశమున్నా, గత ఆరు నెలలుగా పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్రోచ్ పనుల సబ్ కాంట్రాక్టర్‌కు, గామన్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలే జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు నడిచేదెప్పుడు ? పనులు పూర్తి కాకున్నా.. వంతెనపై లారీల వంటి వాహనాల రాకపోకలు మొదలైనా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం బస్సులు నడపడం లేదు. ఈ వంతెన వల్ల అమలాపురం - తాటిపాకల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. జిల్లాలోని కత్తిపూడి - కృష్ణాజిల్లా పామర్రు మధ్య ఉన్న 216 జాతీయ రహదారికి ఈ వంతెన అనుసంధానంగా ఉంది. వంతెనపై బస్సుల రాకపోకలు మొదలైతే కాకినాడ, విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం, ఆకివీడు, కృష్ణాజిల్లా కైకలూరు, పామర్రు, మచిలీపట్నానికి ఇది దగ్గర దారి అవుతుంది. అమలాపురం నుంచి రాజోలు దీవిలోని పలు గ్రామాలకు దగ్గర దారవుతుంది. ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి అమలాపురం, ముమ్మిడివరం, అయినవిల్లి, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది భక్తులు వెళుతుంటారు. వీరు బస్సుల ద్వారా రాకపోకలు సాగించాలంటే అమలాపురం నుంచి తాటిపాక సెంటర్ చేరుకుని అక్కడ నుంచి బస్సు లేదా ఆటోల్లో అప్పనపల్లి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఇబ్బంది కావడంతో చాలా మంది అమలాపురం నుంచి ఆటోల మీద అప్పనపల్లి చేరుకుంటున్నారు. అప్పనపల్లి పరిసర ప్రాంత వాసులు సైతం ప్రయాణాల కోసం ఆటోలపై ఆధారపడుతున్నారు. వంతెనపై బస్సుల రాకపోకలు ఆరంభమైతే అటు రాజోలు, ఇటు అమలాపురం డిపోలకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకూ సర్వీసులు ఎలా నడపాలనే దానిపై ఆర్టీసీ సర్వే కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, జిల్లా, ఎన్‌హెచ్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే వంతెన పనులు పూర్తి కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆరునెలల క్రితం ప్రారంభించేసిన వారధిని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.