స్థానిక స్టేట్ బ్యాంక్ ప్రాంతంలో నీటమునిగిన జాతీయరహదారి
పశ్చిమగోదావరి,ఆకివీడు: జిల్లాలో జాతీయరహదారి 216పై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు వంతెన వద్ద నుంచి ఆకివీడు ప్రధాన సెంటర్ వరకూ జాతీయరహదారి పలు చోట్ల చెరువుల్ని తలపిస్తుంది. భారీ వర్షాలకు రహదారి పూర్తిగా మునిగిపోయింది. పలుచోట్ల గుంతలు పడి ద్విచక్ర వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి పూట ఈ ప్రాంతంలో వాహనంపై ప్రయాణిస్తే అంతే సంగతులని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారికి కనీస మరమ్మతులు చేపట్టడంలేదు.
గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన పక్కా డ్రెయిన్ అడ్రస్సు లేకుండా పోయింది. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలతో డ్రెయిన్‌ను పూడ్చివేశారు. ఇటీవల రహదారి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ వర్షం రావడంతో పనులు నిలిచిపోయాయి. రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఆక్రమణల్లో ఉన్న మార్జిన్లు తొలగించి, పక్కా డ్రెయిన్ సదుపాయం కల్పిస్తేనే వర్షంనీరు పారుదలకు మార్గం ఏర్పడుతుందని చెబుతున్నారు. డ్రెయిన్, మార్జిన్లలో ఉన్న మట్టి తొలగించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment