అమలాపురం :జాతీయ రహదారి -216 విస్తరణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రహదారి విస్తరణతోపాటు జిల్లాలో ఏడు చోట్ల బైపాస్‌ల నిర్మాణం చేపటాల్సి ఉంది. దీని వల్ల పలుచోట్ల ఇళ్లు, వ్యాపార సముదాయాలు, భూములు కోల్పోతున్న వారు విస్తరణకు సంబంధించిన సర్వేపనులను అడ్డుకోవడం, రోడ్డెక్కి ఆందోళన చేయడం చూస్తుంటే పనులు పూర్తవుతాయనే నమ్మకం కలగడం లేదు.
జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పాముర్రు వరకు గత ఎన్డీఏ హయాంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కృషితో ఈ జాతీయరహదారి నిర్మించారు. తిరిగి ఎన్డీఏ హయాంలో ఈ రహదారి విస్తరణకు అనుమతి రాగా, ఇటీవల రూ.మూడు వేల కోట్లు మంజూరైనట్టు సమాచారం. ఇప్పుడున్న ఏడు మీటర్ల రహదారిని మూడు మీటర్ల మేర విస్తరించి, పది మీటర్లు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పామర్రు నుంచి అవనిగడ్డ, రేపల్లె, గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా చీరాల మీదుగా ఒంగోలు వద్ద జాతీయ రహదారి- 16లో కలిసే ఈ రహదారి విస్తరణతో కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా సరుకు రవాణా మరింత వేగవంతమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల నుంచి మత్స్య, కొబ్బరి, ఇతర ఉత్పత్తులు ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు దగ్గరదారి అవుతుంది. రహదారి విస్తరణ సర్వే ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసి మే నుంచి పనులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో మూడు ప్యాకేజీలుగా పనులు..
జిల్లాలోని కత్తిపూడి నుంచి దిండి- చించినాడ వంతెన వరకు విస్తరణ పనులను మూడు ప్యాకేజీలుగా చేశారు. కత్తిపూడి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి అనాతవరం, అనాతవరం నుంచి దిగమర్రు వరకు పనులు చేయనున్నారు. ఇప్పుడున్న రహదారిలో ఎక్కువగా ఉన్న మలుపులను తగ్గించేందుకు ఏరియల్ సర్వే చేశారు. పలు పట్టణాలు, మేజర్ పంచాయతీల మీదుగా రహదారి వెళ్లాల్సి రావడంతో స్థల సేకరణకు భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో పలుచోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్ నిర్ణయించింది. కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులో బైపాస్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. గతంలో పిఠాపురం, తాళ్లరేవు వద్ద బైపాస్‌లు పూర్తయ్యూరుు. పలు చోట్ల ఇళ్ల స్థలాలు, భూములు, వ్యాపార సముదాయాలు, ప్రముఖ ఆలయాలను తొలగించాల్సి ఉంది. ఇదే పలు వివాదాలకు కారణమవుతోంది.
ఇవీ వివాదాలు..
అమలాపురం బైపాస్ రోడ్డును భట్నవిల్లి 93.3 కిలోమీటర్ల వద్ద ఆరంభించాలని ఎన్‌హెచ్ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు దీనిని కొంత ముందుకు తీసుకు వెళ్లడం వల్ల తమకు చెందిన ఐదు ఇళ్లు పోతున్నాయని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ మార్కండేయులు మంగళవారం పరిశీలించారు. కత్తిపూడి నుంచి నుంచి లెక్కిస్తే 100 కి.మీ. వద్ద టోల్‌ప్లాజా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పుడున్న రహదారికి అటు 70, ఇటు 70 మీటర్ల చొప్పున భూమి సేకరించాలని నిర్ణయించారు. ఇది అమలాపురం పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ నుంచి మేకల కాలువ వరకు నిర్మించాల్సి వస్తుంది. దీని వల్ల మూడు కాలనీల్లోని 100 ఇళ్లు, పాఠశాల, కళాశాల, రియల్ ఎస్టేట్ ప్లాట్‌లు పోతారుు. దీనికి బదులు బోడసకుర్రు వంతెన సమీపంలో ప్రభుత్వ స్థలాల వద్ద నిర్మించాలని స్థానికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనితో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ స్థలాలను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు విస్తరణ వల్ల రాజోలు దీవిలో వాణిజ్య కేంద్రమైన తాటిపాక స్వరూపం మారిపోతుంది. వ్యాపార సముదాయలు, ఇళ్లు పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుంది. దీని వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు తాటిపాక, మామిడికుదురు, నగరం వంటి చోట పెద్ద ఎత్తున ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానికులు బైపాస్ రోడ్డు నిర్మించాలని గతంలో నిరాహారదీక్షలు చేపట్టారు. దీనికి స్పందించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు స్థానికులను కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గ డ్కరీ వద్దకు తీసుకు వెళ్లి బైపాస్‌పై హామీ ఇప్పించారు. అయితే ఇప్పటికీ ఇక్కడ బైపాస్‌కు ఎన్‌హెచ్ నుంచి అనుమతి రాకపోవడం విశేషం. బైపాస్ ప్రతిపాదన దశలోనే ఉందని ఎన్‌హెచ్ వర్గాలు చెప్పడంతో స్థానికుల్లో ఆందోళన తొలగలేదు. ముమ్మిడివరం బైపాస్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చడం వల్ల తమ ఇళ్లు, ఇళ్ల స్థలాలను కోల్పోతామని, పెద్దల స్థలాలను రక్షించడం కోసం పేదలైన తమను నష్టపరచడం భావ్యం కాదని స్థానికులు నిరాహారదీక్షలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారి విస్తరణ ఎలా, ఎన్నటికి సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అడుగడుగునా స్పీడ్‌బ్రేకర్లే..
Published Wed, Mar 18 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement