national highway - 44
-
దేశమంత రహదారి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఏ కాలంలో అయినా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రహదారులే జీవనాడులుగా ఉపయోగపడుతాయి. రహదారులు ఎంత పక్కాగా, విస్తృతంగా ఉంటే అభివృద్ధి అంత వేగంగా పరుగులు పెడుతుంది. ఆ వాస్తవాన్ని గుర్తించిన మనదేశ పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే రహదారుల నిర్మాణం, విస్తరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నేడు దేశంలో లక్షల కిలోమీటర్ల జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటిని నిత్యం అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. మనదేశంలో అతిపెద్ద జాతీయ రహదారిగా ఎన్‌హెచ్ 44 గుర్తింపు పొందింది. ఈ చివర నుంచి ఆ చివరకు.. ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానం చేసే దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్–44. ఇది 13 రాష్ట్రాల మీదుగా సాగుతూ 30కిపైగా ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రహదారి పొడవు 3,745 కిలోమీటర్లు. ఉత్తరాన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభమై హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని బెంగుళూరు నగరం మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు కొనసాగుతుంది. అంటే ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య రవాణాకు ఇది ఆయుపట్టు లాంటిది. ఈ రహదారిపై నిరంతరం లక్షలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా సరకు రవాణా లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వివిధ రాష్ట్రాలకు సరకులను మోసుకెళుతుంటాయి. నాటి ఎన్‌హెచ్–7.. నేటి ఎన్‌హెచ్–44 ఈ రహదారి మొదట్లో 7వ నంబర్ జాతీయ రహదారిగా ఉండేది. అయితే నార్త్–సౌత్ కారిడార్‌గా దీనిని గుర్తించి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌హెచ్‌డీపీ) కింద అభివృద్ధి చేసే క్రమంలో ఎన్‌హెచ్–1ఎ, ఎన్‌హెచ్–1, ఎన్‌హెచ్–2, ఎన్‌హెచ్–3, ఎన్‌హెచ్–75, ఎన్‌హెచ్–26, ఎన్‌హెచ్–7 రహదారులన్నింటినీ కలిపి ఎన్‌హెచ్–44 గా మార్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండటంతో సరకుల రవాణా ఎక్కువగా ఈ రహదారి మీదుగా సాగుతోంది. రాత్రింబవళ్లు భారీ ట్రక్కులు, లారీలు, వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాష్ట్రాల అనుసంధానం 44వ నంబర్ జాతీయ రహదారి పొడవు 3,745 కిలోమీటర్లు. జమ్మూకశ్మీర్‌లో 304 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 11, పంజాబ్‌లో 279, హర్యానాలో 257, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్‌లో 287, రాజస్థాన్‌లో 28, మధ్యప్రదేశ్‌లో 547, మహారాష్ట్రలో 260, తెలంగాణలో 533, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 135, తమిళనాడులో 630 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అక్రమ రవాణాకూ రాచమార్గమే.. ఎన్‌హెచ్–44 మీదుగా సరకుల అక్రమ రవాణా కూడా ఎక్కువగానే సాగుతుంటుంది. అప్పుడప్పుడు హైవే మీద ట్రక్కులు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న మత్తు పదార్థాలు, ఇతర సామగ్రి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎక్కువగా ఈ రహదారి మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. -
నలుగురిని బలిగొన్న అతివేగం
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మంతెన జనార్ధన్ దుబాయ్‌లో ఉంటాడు. ఆయన భార్య లావణ్య (35), కూతురు రోషిణి (15) నిజామాబాద్‌లో నివాసముండగా, కుమారుడు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. అయితే, జనార్ధన్ ఇంట్లో అద్దెకుండే నాగమణి కుమారుడు అరుణ్ ఆదివారం రాత్రి ఇరాక్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కారు ఇవ్వాలని అరుణ్ ఇంటి యజమాని లావణ్యను అడగడంతో ఆమె సరేనంది. హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడ్ని చూసేందుకు తాను కూడా వస్తానని తెలిపింది. దీంతో లావణ్య, ఆమె కూతురు రోషిణి, అరుణ్‌తో పాటు డ్రైవర్ అంగూర్ సుశీల్ (22), ఆయన స్నేహితుడు నవీపేట మండలం సుభాష్‌నగర్‌కు చెందిన మ్యాదరి ప్రశాంత్ (30) ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో కారు (ఏపీ15ఏడీ 5050)లో బయల్దేరారు. ఎయిర్‌పోర్టులో అరుణ్‌ను విడిచి పెట్టిన అనంతరం లావణ్య కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అతివేగం, నిద్రమత్తే కారణం! డ్రైవర్ సుశీల్ నిద్రమత్తులో అతివేగంగా నడపడంతో కారు అదుపు తప్పింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు భిక్కనూరు మండలం జంగంపల్లి వద్దకు రాగానే కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. కిలోమీటరు సూచిక రాయిని ఢీకొని, అదే వేగంతో వంద మీటర్ల దూరంలో ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో కారు తలుపులను తొలగించి బయటకు తీశారు. మృతదేహాలను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
సాక్షి, కర్నూలు : జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగమర్రి మద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. దాదాపు కోటికి పైగా నష్టం జరిగినట్టుగా సమాచారం. బస్సు వెనుక భాగం నుంచి మంటలు మొదలైనట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
అనంతపురం సీపీఎం నేతల అరెస్ట్
అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టుకు నిధులు రూ.2వేల కోట్లు కేటాయించాలంటూ జాతీయ రహదారి - 44ను అనంతపురం సీపీఎం నేతలు దిగ్బంధించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రహదారిని దిగ్బంధించినందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.