దేశంలో అతిపెద్ద రహదారిగా ఎన్‌హెచ్ 44 రికార్డు
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగుతున్న హైవే
3,745 కి.మీ.. 13 రాష్ట్రాలు.. 30 నగరాల అనుసంధానం
నేషనల్ హైవే డెవలప్‌మెంట్ కారిడార్‌గా గుర్తింపు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఏ కాలంలో అయినా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రహదారులే జీవనాడులుగా ఉపయోగపడుతాయి. రహదారులు ఎంత పక్కాగా, విస్తృతంగా ఉంటే అభివృద్ధి అంత వేగంగా పరుగులు పెడుతుంది.
ఆ వాస్తవాన్ని గుర్తించిన మనదేశ పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే రహదారుల నిర్మాణం, విస్తరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నేడు దేశంలో లక్షల కిలోమీటర్ల జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటిని నిత్యం అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. మనదేశంలో అతిపెద్ద జాతీయ రహదారిగా ఎన్‌హెచ్ 44 గుర్తింపు పొందింది.
ఈ చివర నుంచి ఆ చివరకు..
ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానం చేసే దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్–44. ఇది 13 రాష్ట్రాల మీదుగా సాగుతూ 30కిపైగా ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రహదారి పొడవు 3,745 కిలోమీటర్లు.
ఉత్తరాన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభమై హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని బెంగుళూరు నగరం మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు కొనసాగుతుంది.
అంటే ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య రవాణాకు ఇది ఆయుపట్టు లాంటిది. ఈ రహదారిపై నిరంతరం లక్షలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా సరకు రవాణా లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వివిధ రాష్ట్రాలకు సరకులను మోసుకెళుతుంటాయి.
నాటి ఎన్‌హెచ్–7.. నేటి ఎన్‌హెచ్–44
ఈ రహదారి మొదట్లో 7వ నంబర్ జాతీయ రహదారిగా ఉండేది. అయితే నార్త్–సౌత్ కారిడార్‌గా దీనిని గుర్తించి నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎన్‌హెచ్‌డీపీ) కింద అభివృద్ధి చేసే క్రమంలో ఎన్‌హెచ్–1ఎ, ఎన్‌హెచ్–1, ఎన్‌హెచ్–2, ఎన్‌హెచ్–3, ఎన్‌హెచ్–75, ఎన్‌హెచ్–26, ఎన్‌హెచ్–7 రహదారులన్నింటినీ కలిపి ఎన్‌హెచ్–44 గా మార్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండటంతో సరకుల రవాణా ఎక్కువగా ఈ రహదారి మీదుగా సాగుతోంది. రాత్రింబవళ్లు భారీ ట్రక్కులు, లారీలు, వాహనాలు తిరుగుతూనే ఉంటాయి.
రాష్ట్రాల అనుసంధానం
44వ నంబర్ జాతీయ రహదారి పొడవు 3,745 కిలోమీటర్లు. జమ్మూకశ్మీర్‌లో 304 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 11, పంజాబ్‌లో 279, హర్యానాలో 257, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్‌లో 287, రాజస్థాన్‌లో 28, మధ్యప్రదేశ్‌లో 547, మహారాష్ట్రలో 260, తెలంగాణలో 533, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 135, తమిళనాడులో 630 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
అక్రమ రవాణాకూ రాచమార్గమే..
ఎన్‌హెచ్–44 మీదుగా సరకుల అక్రమ రవాణా కూడా ఎక్కువగానే సాగుతుంటుంది. అప్పుడప్పుడు హైవే మీద ట్రక్కులు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న మత్తు పదార్థాలు, ఇతర సామగ్రి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎక్కువగా ఈ రహదారి మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment