
సొంతూళ్లకు తరలి వెళ్లుతున్న ఇతర రాష్ట్రాల కార్మికులు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జీపీఆర్ ద్వారా ఐదు చోట్ల అనుమానిత అవశేషాలు గుర్తింపు
ఆ ప్రాంతాల్లో తవ్వతే కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందంటున్న నిపుణులు
శిథిలాల తొలగింపు, డీవాటరింగ్, వెల్డింగ్ పనులు వేగవంతం
మృతదేహాలేవీ లభించలేదు.. ఆ వార్తలను నమ్మొద్దు: నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసేందుకు చేపడుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. టన్నెల్‌లో ప్రమాదం జరిగి, సుమారు 18 అడుగుల మేర మట్టి, శిథిలాలతో నిండిపోయిన ప్రాంతంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) ద్వారా స్కానింగ్ చేశారు. ఈ క్రమంలో ఐదు చోట్ల అనుమానిత అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రమాద స్థలంలో మట్టి, రాళ్లు, బురద, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం), ఇతర పరికరాల శిథిలాలతో నిండిపోగా.. అందులో కొన్నిచోట్ల మానవ దేహాలుగా భావిస్తున్న కొన్ని సున్నితమైన వస్తువులు ఉన్నట్టుగా రాడార్ సిగ్నల్స్ ద్వారా నిర్ధారించారు.
ఆ చోట్ల తవ్వకాలు చేపడుతున్నారు. దీనితో ఏ క్షణంలోనైనా కార్మికులను బయటికి తీసే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే అధునాతన క్రిటికల్ కేర్ అంబులెన్స్‌లు, వైద్యులు, ఆక్సిజన్‌ను అందుబాటు లో ఉంచారు. ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్‌కుమార్ గుప్తా, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, సింగరేణి సీఎండీ బలరాం తదితరు లు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్..
టన్నెల్‌లో కన్వేయర్ బెల్టు ఇంకా సిద్ధం కాకపోవడంతో.. సహాయక బృందాల రాకపోకలు, శిథిలాలు, మట్టి, బురద తొలగింపునకు లోకో ట్రైన్ ఒక్కటే ఆధారంగా మారింది. దానిపై రెస్క్యూ టీం సభ్యులను, బురద, మట్టి, శిథిలాలను మూడు కోచ్‌ల్లో తరలిస్తున్నారు. ఈ లోకోట్రాక్ 13.50 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉన్నా... చివరి 300 మీటర్ల ప్రాంతంలో 2 అడుగుల మేర మట్టి, బురద పేరుకుని ఉంది. దీనితో 13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. ఇప్పుడు మిగతా ట్రాక్‌పై ఉన్న బురదను మినీ డోజర్‌తో తొలగిస్తూ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.
నాలుగు షిఫ్టులుగా పనులు
టన్నెల్‌లో మొత్తం 250 మంది రెస్క్యూ సిబ్బంది నాలుగు షిఫ్టులుగా పనిచేస్తున్నారు. శిథిలాల కింద టీబీఎం ముక్కలై పోయి 40 మీటర్ల దూరం వరకు చెదిరిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న ఈ టీబీఎం మెషీన్ భాగాలు, శిథిలాలు, పైపులు, గడ్డర్లను సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో గ్యాస్ కట్టర్స్, వెల్డర్స్ కలసి క ట్ చేసి తొలగిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 200 మంది సింగరేణి కార్మికులు ఎస్‌ఎల్‌బీసీ వద్దకు చేరుకున్నారు. ఇక సొరంగంలో కిందకి వంగిపోయిన ఎయిర్ బ్లోయర్‌ను కట్ చేసి సరిచేశారు. మొత్తం పది మోటార్లతో డీవాటరింగ్ ప్రక్రి య చేపడుతున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిలో జార్ఖండ్‌కు చెందిన కార్మికుల కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద దోమలపెంటకు చేరుకోగా.. పంజాబ్‌కు చెందిన గురుప్రీత్‌సింగ్ కుటుంబసభ్యులు శుక్రవారం చేరుకున్నారు.
జీపీఆర్ గుర్తించింది.. కచి్చతమని చెప్పలేం: సింగరేణి సీఎండీ బలరాం
సొరంగంలోని ప్రమాద స్థలంలో జీపీఆర్ స్కానింగ్‌లో అనుమానిత స్పాట్లను నిపుణులు గుర్తించారని.. అయితే దీనిపై కచి్చతమైన నిర్ధారణకు రాలేదని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్జీఆర్‌ఐ ఆధ్వర్యంలో కొన్ని స్పాట్లు అంచనా వేశారు. వాటిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. వారిని బయటికి తీసేందుకు సమయం పడుతుంది. సొరంగంలో గ్యాస్ కట్టింగ్, వెల్డింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’’ అని బలరాం తెలిపారు.
తప్పుడు ప్రచారం నమ్మవద్దు..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కార్మికుల మృతదేహాలు లభించాయంటూ వస్తున్న వార్తలు, ప్రచారాన్ని నమ్మవద్దు. ఎన్‌జీఆర్‌ఐ ఆధ్వర్యంలో జీపీఆర్ విధానంలో గుర్తించిన స్పాట్లు పూర్తిగా నిర్ధారణ కాలేదు. వాటిని ఇంకా నిపుణులతో పరిశీలించాల్సి ఉంది. వీలైనంత త్వరగా కార్మికులను బయటికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment