
జంగంపల్లి వద్ద చెట్టుని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మంతెన జనార్ధన్ దుబాయ్‌లో ఉంటాడు. ఆయన భార్య లావణ్య (35), కూతురు రోషిణి (15) నిజామాబాద్‌లో నివాసముండగా, కుమారుడు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. అయితే, జనార్ధన్ ఇంట్లో అద్దెకుండే నాగమణి కుమారుడు అరుణ్ ఆదివారం రాత్రి ఇరాక్‌కు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కారు ఇవ్వాలని అరుణ్ ఇంటి యజమాని లావణ్యను అడగడంతో ఆమె సరేనంది. హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడ్ని చూసేందుకు తాను కూడా వస్తానని తెలిపింది. దీంతో లావణ్య, ఆమె కూతురు రోషిణి, అరుణ్‌తో పాటు డ్రైవర్ అంగూర్ సుశీల్ (22), ఆయన స్నేహితుడు నవీపేట మండలం సుభాష్‌నగర్‌కు చెందిన మ్యాదరి ప్రశాంత్ (30) ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో కారు (ఏపీ15ఏడీ 5050)లో బయల్దేరారు. ఎయిర్‌పోర్టులో అరుణ్‌ను విడిచి పెట్టిన అనంతరం లావణ్య కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
అతివేగం, నిద్రమత్తే కారణం!
డ్రైవర్ సుశీల్ నిద్రమత్తులో అతివేగంగా నడపడంతో కారు అదుపు తప్పింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు భిక్కనూరు మండలం జంగంపల్లి వద్దకు రాగానే కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. కిలోమీటరు సూచిక రాయిని ఢీకొని, అదే వేగంతో వంద మీటర్ల దూరంలో ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో కారు తలుపులను తొలగించి బయటకు తీశారు. మృతదేహాలను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment