National Highway Authorities of India
-
ఎన్‌హెచ్–544డీ: అనంతపురం టూ గుంటూరు లైన్ క్లియర్
అనంతపురం నుంచి గుంటూరుకు మార్గం సుగమమైంది. నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 417.91 కిలో మీటర్ల మేర రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్–544డీ’ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపి, టెండర్లు ఖరారు చేసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం ఎన్హెచ్ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములు ప్రభుత్వం సేకరించి అటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2018లోనే అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు – అనంత పురం మధ్య ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తోంది. దాన్ని సది్వనియోగం చేసుకుంటూ అనంతపురం, గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. దీంతో అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల నాలుగు లేన్ల జాతీయ రహదారి – 544డీ నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 71.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. టెండర్లు ఖరారు = మొదటి ప్యాకేజీలో భాగంగా అనంతపురం శివారు పామురాయి నుంచి ముచ్చుకోట వరకు 39.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.684.30 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 1.12 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్–1గా నిలిచి పని దక్కించుకుంది. అంచనా కంటే 0.90 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–2 గా నిలిచింది. = రెండో ప్యాకేజీలో ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు రూ.738.82 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 0.74 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది. రెండు సంవత్సరాల్లో ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో 71 కిలోమీటర్లు అనంతపురం – గుంటూరు జాతీయ రహదారికి సంబంధించి అనంతపురం జిల్లాలో 71 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన టెండర్లు ఖరారు అయ్యాయి. త్వరలోనే పనులు మొదలుపెట్టాలి. జిల్లా నుంచి మరికొన్ని జిల్లాలను కలుపుతూ సాగే ఈ రహదారి పూర్తయితే మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుంది. –మధుసూదన్‌రావు, ఈఈ, ఎన్హెచ్ఏఐ -
భారత్‌లో ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. తస్మాత్ జాగ్రత్త
న్యూఢిల్లీ: సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారంప ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. ఉత్తరప్రదేశ్ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా ఢిల్లీ (7): కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడిసియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ) పశ్చిమబెంగాల్ (2): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా; ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా ఒడిశా (2): నవభారత్ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీలు కూడా ఫేక్ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది. 17.94 లక్షల ‘కరోనా’ క్లెయిమ్‌లు సెటిల్ దేశంలో గత 15 నెలల్లో కోవిడ్–19కు సంబంధించి రూ.21,837 కోట్ల విలువైన 17.94 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు సెటిల్ చేసినట్లు భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేందుకు ఐఆర్డీఏఐ చర్చలు చేపట్టిందని అన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 15 వరకూ 17.94 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయని వివరించారు. 204 ప్రైవేటు చానెళ్ల నిలిపివేత నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2016–20ల మధ్య 204 ప్రైవేటు చానెళ్ల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 916 ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లకు అప్–లింకింగ్, డౌన్–లింకింగ్ల మార్గదర్శకాల ప్రకారం అనుమతులు ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. నిబంధలను పాటించలేకపోవడం వల్లే 204 చానళ్ల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు. కొత్త చానెళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. 2016–17లో 60 చానెళ్లు, 2017–18లో 34 చానెళ్లు, 2018–19లో 56 చానెళ్లు, 2020–21లో 22 చానెళ్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ►దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 2.96 కోట్ల మంది స్కూలు విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆన్లైన్ విద్య కోసం ఉపయోగించాల్సిన మొబైల్/లాప్‌టాప్‌లు లేని విద్యార్థులు అత్యధికంగా బిహార్‌లో ఉన్నారని పేర్కొంది. మరి కొన్ని రాష్ట్రాల్లో సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ►కరోనా కారణంగా మరణించిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ. 5.05 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించిన విధానాలకు లోబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ రుణాలు రూ.3.06 లక్షల కోట్లు: గడ్కరీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తీసుకున్న రుణాలు 2021 మార్చి నాటికి రూ.3,06,704 కోట్లకు చేరాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ రుణాలు రూ.74,742 కోట్లు ఉండేవని తెలిపారు. రుణాలపై ఎన్హెచ్ఏఐ 2020–21లో రూ.18,840 కోట్ల వడ్డీని చెల్లించిందని పేర్కొన్నారు. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలంటూ కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పాత వాహనాలపై అత్యధికంగా గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. -
హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి తెలిపింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది. (హైవేల విస్తరణకు నిధులు) అలాగే ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రిని సోమవారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నెడునూరి దిలీపాచారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు. (రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు) -
ఎంఈఐఎల్కు జోజిల్లా పాస్ టన్నెల్ పనులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్- లడఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లలో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఐడీసీఎల్ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీ వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్‌గా ఉంది. సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్లా రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు. రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచు తుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. -
హాయి వే..
ఖమ్మంఅర్బన్: నేషనల్ హైవే అధికారులు మరో హైవే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న హైవేలతో అనుసంధానమైన నగరం.. కొత్త హైవే నిర్మాణంతో కొత్త రూపును సంతరించుకోనుంది. తాజాగా హైవే నిర్మాణానికి భూమి అవసరం ఉందంటూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓ ఇంగ్లిష్ దినపత్రికలో ఈనెల 5వ తేదీన భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ చూసిన కొందరు హైవే వస్తుందని సంతోషపడుతుంటే.. భూమి కోల్పోతున్న రైతులు మాత్రం సాగు భూములను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట–రాజమండ్రి నేషనల్ హైవే కోసం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి తదితర మండలాలకు చెందిన రైతులు రోడ్డు కోసం తమ భూములు ఇచ్చేది లేదని, ప్రభుత్వం అందించే పరిహారం అనుకున్న విధంగా లేదంటూ సర్వేలను అడ్డుకోవడం, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేస్తుండగా.. కొత్తగా నాగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కొన్ని నెలల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేయించిన విషయం విదితమే. ఏజెన్సీ సర్వే ఆధారంగా అనుకూలంగా ఉన్న నివేదికను తీసుకొని దాని ప్రకారం రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సర్వే నంబర్లవారీగా గుర్తించి.. గ్రామాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 5వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లో ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల నుంచి రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం వరకు సుమారు 21.5 కిలో మీటర్ల దూరంలోని సుమారు 260 ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 300 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. 21 కిలో మీటర్ల దూరంలోనే 260 ఎకరాలకుపైగా సాగు భూములను కోల్పోయే అవకాశం ఉండడంతో ఏయే సర్వే నంబర్ల నుంచి భూమి పోతుందని చూసుకున్న రైతులు కలవరపడుతున్నారు. కొందరికి ఉన్న 10 కుంటలు, ఎకరం, రెండెకరాల భూమి రోడ్డుకు పోతే.. తమకు చావే దిక్కని ఆందోళనకు గురవుతున్నారు. మరికొందరికి ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఉపయోగకరంగా ఉన్నా.. తాము మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం నగర సమీపం నుంచే వెళ్తుండడంతో ఆ ప్రాంతంలో భూములంటే ఎకరం సుమారుగా రూ.30లక్షల నుంచి రూ.కోటికిపైగానే ధర పలుకుతుంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం అంత ధర చెల్లిస్తుందా.. అని ప్రశ్నించుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూమి పోతే మా గతేంటి అని రైతులు తమకు తెలిసిన నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి భూ సేకరణపై ఆరా తీస్తున్నారు. జారీ అయిన ప్రకటన ఆధారంగా అనేక మంది రైతులు రోడ్డు ఏ మార్గంలో ఉంది.. ఏ సర్వే నంబర్ నుంచి పోతుంది.. దాని హద్దులు ఏమిటంటూ.. స్థానికంగా రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుండగా.. ఈ అంశం గురించి తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్లో 90.5 కిలో మీటర్ నుంచి 112 కిలో మీటర్ వరకు భూ సేకరణ అంటూ.. సుమారు 21 కిలో మీటర్ల దూరంలో సుమారు 136 సర్వే నంబర్ల పరిధిలో 106 హెక్టార్లు అంటే.. 260 ఎకరాల వరకు భూమి అవసరం ఉంటుందని చూపించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల పరిధిలో 58 సర్వే నంబర్లు, ఖమ్మం అర్బన్‌లోని బల్లేపల్లి పరిధిలో 3 సర్వే నంబర్లు, రఘునాథపాలెం మండలం కామంచికల్ పరిధిలో 17 సర్వే నంబర్లు, రఘునాథపాలెం పరిధిలో 29 సర్వే నంబర్లు, రేగులచెలక పరిధిలో 18 సర్వే నంబర్లు, వీవీపాలెం పరిధిలో 11 సర్వే నంబర్లు ఉన్నాయి. రెండెకరాలు పోతుంది.. గతంలో సర్వే చేసినప్పుడు హద్దుల ప్రకారం చూస్తే మాకున్న రెండెకరాల్లో మొత్తం భూమి పోతుంది. మా సర్వే నంబర్ కూడా భూసేకరణ ప్రకటనలో ఉంది. భూమినే నమ్ముకున్న మేము.. దానిని రోడ్డు పేరుతో తీసుకుంటే మా పరిస్థితి ఏమిటనేది అర్థం కావట్లేదు. – వేగనాటి కిషోర్, రఘునాథపాలెం అనుకూలంగా ధరొస్తే ఇస్తాం.. అధికారులు సర్వే చేసిన ప్రాంతంలో మా కుటుంబ సభ్యులకు ఏడెకరాల భూమి ఉంది. దాంట్లో తన వాటాగా కొంత భూమి వస్తుంది. ప్రకటన జారీ ప్రకారం మా భూమిలో అరెకరం వరకు పోతుంది. ఏదైనా రైతులకు అనుకూలంగా ధర వస్తేనే భూమి ఇస్తాం. – మల్లీదు వెంకటేశ్వర్లు, బల్లేపల్లి -
హైవేలపై పెరిగిన టోల్ ఫీజు
ఆగ్రా: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారంగా మారింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ రేట్లను 5 నుంచి 7శాతం పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల రవాణా వాహనాలకూ ఇది వర్తిస్తుంది. జాతీయ రహదారి–2 ప్రాజెక్టు డైరెక్టర్ మహ్మద్ షఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జాతీయరహదారులపై 372 టోల్ప్లాజాలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ రేట్లను టోకు ధరల సూచీ ప్రాతిపదికగా సవరిస్తుంది. దీంతో ఒకే ప్రాంతంలోని టోల్‌ప్లాజాల వద్ద వసూలు చేసే ఫీజులు ఒకేలా ఉండవు. ఎన్‌హెచ్–2పై టోల్ రేట్లలో 5శాతం పెరుగుదల ఉంటుంది’అని షఫీ తెలిపారు. ఎక్కువ శాతం టోల్‌ప్లాజాల వద్ద ఇదే పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు. నెలవారీ పాస్‌లున్న వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. టోల్ రేట్ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని వాహనయజమానులు అంటున్నారు. ఎన్‌హెచ్–1, 2లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం టోల్ ఫీజు పెంచిందని విమర్శిస్తున్నారు. -
ఎక్స్‌ప్రెస్‌వే వెంట మురికి కాలువ
ఎన్హెచ్ఏఐకి డిజైన్ ఇచ్చిన ఎమ్సీజీ గుర్గావ్: హీరోహోండా చౌక్ సమీపంలో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)తో కలిసి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీజీ) మురికి కాలువల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే ఉన్న ఎన్హెచ్ఏఐ కాలువతోపాటుగా ఢి ల్లీ -గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవునా ఇది ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. దీనికోసం ఇప్పటికే హైవేస్ అథారిటీతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ అందుకోసం ఓ డిజైన్‌ను కూడా సమర్పించింది. డిజైన్‌కు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలపగానే నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే దీనికి 17 కోట్ల రూపాయల మేర ఖర్చువుతుందని అధికారులు భావిస్తున్నారు. ‘‘ఈ రంగంలో నిపుణులతో చర్చించిన తరువాతే డిజైన్ రూపొందించాం. అయితే రెండు భిన్నమైన ప్రణాళికలతో మేం సిద్ధం చేశాం. ఒకటి హీరో హోండా చౌక్ దగ్గరది కాగా... మరొకటి హీరోహోండా చౌక్ నుంచి ఖస్త్రర్కీ దౌలా వరకు. అయితే మొదటి ప్రణాళికకు 17 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. దీనిని ఇప్పటికే ఎన్హెచ్ఏఐకి అందజేశాం. దానికి ఆమోదముద్ర పడగానే టెండర్లను పిలిచి నిర్మాణం పనులుమొదలు పెడతాం’ అని ఎమ్సీజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఖర్చులోని కొంత భాగాన్ని ఎన్హెచ్ఏఐ పంచుకుంటుందని ఎమ్సీజీ ఆశిస్తోం ది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులు కొంత భాగాన్ని పంచుకోమని ఎన్హెచ్ఏఐ అధికారులను కోరతామని, ఒకవేళ వారు అందుకు అంగీకరించకపోతే మొత్తం ఖర్చును తామే భరిస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మురి కినీటిని డీజిల్‌తో నడిచే పంపుల ద్వారా ఎమ్సీజీ తొలగిస్తోంది. డీజిల్ పంపుల ఆపరేటర్లు తరచూ డీజిల్‌ను దొంగతనం చేస్తుండటం వల్ల ఈ పద్ధతి విజయవంతం కావడం లేదని కమిషనర్ అంటున్నారు. ఈ వర్షాకాలానికల్లా కాలువ నిర్మాణం పూర్తి కాదని, వచ్చే ఏడాదికల్లానయినా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే కాలువ నిర్మాణం కోసం రోడ్డుకిరుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్‌కు ఎంతమేర స్థలం అవసరమవుతుందో గుర్తించే పనిలో ఉన్నామని, హీరోహోండా చౌక్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొల గిస్తామని, ఒకవేళ డిజైన్‌కు ఆమోదం రాకపోతే మరో డిజైన్‌ను ఎన్హెచ్ఏఐకి సమర్పిస్తామని గుర్గావ్ మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు.