అనంతపురం నుంచి గుంటూరుకు మార్గం సుగమమైంది. నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 417.91 కిలో మీటర్ల మేర రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్–544డీ’ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపి, టెండర్లు ఖరారు చేసింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం ఎన్‌హెచ్‌ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములు ప్రభుత్వం సేకరించి అటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2018లోనే అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు – అనంత పురం మధ్య ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తోంది. దాన్ని సది్వనియోగం చేసుకుంటూ అనంతపురం, గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. దీంతో అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల నాలుగు లేన్ల జాతీయ రహదారి – 544డీ నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 71.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది.
టెండర్లు ఖరారు
= మొదటి ప్యాకేజీలో భాగంగా అనంతపురం శివారు పామురాయి నుంచి ముచ్చుకోట వరకు 39.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.684.30 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 1.12 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎల్–1గా నిలిచి పని దక్కించుకుంది. అంచనా కంటే 0.90 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–2 గా నిలిచింది.
= రెండో ప్యాకేజీలో ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు రూ.738.82 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 0.74 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది. రెండు సంవత్సరాల్లో ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది.
జిల్లాలో 71 కిలోమీటర్లు
అనంతపురం – గుంటూరు జాతీయ రహదారికి సంబంధించి అనంతపురం జిల్లాలో 71 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన టెండర్లు ఖరారు అయ్యాయి. త్వరలోనే పనులు మొదలుపెట్టాలి. జిల్లా నుంచి మరికొన్ని జిల్లాలను కలుపుతూ సాగే ఈ రహదారి పూర్తయితే మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుంది.
–మధుసూదన్‌రావు, ఈఈ, ఎన్‌హెచ్‌ఏఐ
Comments
Please login to add a commentAdd a comment