న్యూఢిల్లీ: సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారంప ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే..
ఉత్తరప్రదేశ్ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా
ఢిల్లీ (7): కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడిసియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ)
పశ్చిమబెంగాల్ (2): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా
ఒడిశా (2): నవభారత్ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీలు కూడా ఫేక్ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది.
17.94 లక్షల ‘కరోనా’ క్లెయిమ్‌లు సెటిల్
దేశంలో గత 15 నెలల్లో కోవిడ్–19కు సంబంధించి రూ.21,837 కోట్ల విలువైన 17.94 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు సెటిల్ చేసినట్లు భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేందుకు ఐఆర్‌డీఏఐ చర్చలు చేపట్టిందని అన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 15 వరకూ 17.94 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయని వివరించారు.
204 ప్రైవేటు చానెళ్ల నిలిపివేత
నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2016–20ల మధ్య 204 ప్రైవేటు చానెళ్ల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 916 ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లకు అప్–లింకింగ్, డౌన్–లింకింగ్‌ల మార్గదర్శకాల ప్రకారం అనుమతులు ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. నిబంధలను పాటించలేకపోవడం వల్లే 204 చానళ్ల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు. కొత్త చానెళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. 2016–17లో 60 చానెళ్లు, 2017–18లో 34 చానెళ్లు, 2018–19లో 56 చానెళ్లు, 2020–21లో 22 చానెళ్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
►దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 2.96 కోట్ల మంది స్కూలు విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆన్‌లైన్ విద్య కోసం ఉపయోగించాల్సిన మొబైల్/లాప్‌టాప్‌లు లేని విద్యార్థులు అత్యధికంగా బిహార్‌లో ఉన్నారని పేర్కొంది. మరి కొన్ని రాష్ట్రాల్లో సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపింది.
►కరోనా కారణంగా మరణించిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ. 5.05 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించిన విధానాలకు లోబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎన్‌హెచ్‌ఏఐ రుణాలు రూ.3.06 లక్షల కోట్లు: గడ్కరీ
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తీసుకున్న రుణాలు 2021 మార్చి నాటికి రూ.3,06,704 కోట్లకు చేరాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ రుణాలు రూ.74,742 కోట్లు ఉండేవని తెలిపారు. రుణాలపై ఎన్‌హెచ్‌ఏఐ 2020–21లో రూ.18,840 కోట్ల వడ్డీని చెల్లించిందని పేర్కొన్నారు. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలంటూ కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పాత వాహనాలపై అత్యధికంగా గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment