National Institutions
-
జాతీయ విద్యాసంస్థలకు రూ. 6143 కోట్లు కేటాయించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా సంస్థలకు 6,143 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కోసం జరిపిన నిధుల కేటాయింపు గురించి వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి ఈ మొత్తం కేటాయించినట్టు గురువారం రాజ్యసభలో వెల్లడించారు. అంతేకాకుండా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. విద్యాసంస్థలకు కేటాయించిన మొత్తంలో 2018 డిసెంబర్ నాటికి 195.14 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2017-18 బడ్జెట్లో విద్యా సంస్థలకు 250 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని చెప్పిన సత్యపాల్ సింగ్.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2018 డిసెంబర్ 14వ తేదీన లోక్‌సభ ఆమోదం పొందినట్టు తెలిపారు. కేటాయింపుల్లో.. సెంట్రల్ యూనివర్సిటీకి 902 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి(తెలంగాణతో కలిపి) 834 కోట్లు, ఐఐటీ తొలి దశకు 1074 కోట్లు, ఎన్ఐటీకి 460 కోట్లు, ఐఐఎంకు 594 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్‌కి 1979 కోట్లు, ట్రిపుల్ ఐఐటీకి 297 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా విద్యా సంస్థలను శాశ్వత క్యాంపస్‌లకు తరలించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఐఐటీ భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి గుర్తుచేశారు. -
జాతీయ విద్యాసంస్థలను సిద్ధం చేయండి: సీఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఏడు జాతీయ విద్యాసంస్థల్లో సాధ్యమైనంత త్వరితంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జాతీయ విద్యాసంస్థలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), అనంతపురంలో సెంట్రల్‌వర్సిటీ, విజయనగరంలో ట్రైబల్వర్సిటీల ఏర్పాటు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి ప్రగతి గురించి విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా వివరించారు. -
జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్న కేంద్రప్రభుత్వం అందుకు చర్యలు ప్రారంభించింది. వీటికి అవసరమయ్యే స్థలాల సేకరణకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా శాఖకు లేఖ రాసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్ర ట్రిపుల్ ఐటీల ఏర్పాటు విషయమై పలు సూచనలు చేసింది. రోడ్డు, రైలు, ఆకాశయాన మార్గాలకు అనుగుణంగా ఈ స్థలాల ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఐఐటీకి 300 ఎకరాలు, ఎన్ఐటీకి 300 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 200 ఎకరాల చొప్పున స్థలం అవసరమని పేర్కొంది.