లాభాల పాడి
లక్సెట్టిపేట : పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 125 కోట్లు ఉంటే ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే ఉండాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ వివరించారు.
ప్రస్తుతం దేశంలో పాల దిగుబడి 110మిలియన్ టన్నులు.. ఐదు శాతం వృద్ధి రేటుతో 2020వ సంవత్సరానికి మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటి జాతి పశువులు. కావున వీటిలో అధిక దిగుబడి ఆశించడం అసాధ్యం. దేశవాలి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం ఉంది. రైతులు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటే అధిక పాల దిగుబడితోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు.
ముర్రాజాతి గేదెలను పొందే విధానం
ముర్రాజాతి గేదెలను గ్రామీణ ప్రాంతాల్లో గౌడిగేదెలు అని కూడా పిలుస్తారు.
కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మన దేశవాళి గేదెల నుంచి గ్రేడీడ్ ముర్రాజతి దూడలను పొందవచ్చు.
పిండమార్పిడి ప్రక్రియ ద్వారా కూడా పొందవచ్చు.
పశుక్రాంతి పథకం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
ఈ మూడింటిలో ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి, పశుక్రాంతి పథకం ద్వారా సులభంగా పొందవచ్చు.
లాభాలు..
ముర్రా అంటే మెలివేయబడిన అని అర్థం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవ జాతుల్లో అత్యంత శ్రేష్టమైనది. పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాలి గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు.
దేశవాళి గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ(వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం పాడితో ఉండడం వల్ల). వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతోపాటు దృఢమైన దూడలనిస్తాయి. దూడబరువు రోజువారీగా 400 నుంచి 500 గ్రాములు పెరుగుతూ త్వరగా ఎదకు వస్తాయి.
పొందే విధానం..
ముర్రాజాతి గేదెకు ఒక్కో దానికి సుమారు రూ.50వేలు ఉంటుంది.
రవాణా ఖర్చు సుమారు రూ.6,500 అవుతుంది.
గేదె బీమాకు రూ.2వేలు చెల్లించాలి.
గేదె ధరను బట్టి 4 నుంచి 5 శాతం వరకు బీమా లెక్కిస్తారు. బీమా చేయించడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోతే యజమాని నష్టపోకుండా ఉంటారు.
బీమా కంపెనీలు
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
యునెటైడ్ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ
న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ
బ్యాంకు రుణాలు..
యజమాని ఒక గేదెను కొనడానికి సుమారు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాలి. కానీ అంత పెట్టుబడి పెట్టలేని వారి కోసం ప్రభుత్వం సాధారణ, మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమ తి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్పిస్తోంది. గేదె ధరకు మార్జిన్ మనీ కింద 20శాతాన్ని చెల్లిం చాలి.
మిగితా మొత్తం బ్యాంకు చెల్లించి గేదెను దిగుమతి చేస్తుంది. ఇందులో సుమారు 25 నుంచి 50శాతం వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు ఒ కేసారి ఐదు నుంచి పది గేదెలతో మినీ డెయిరీ ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. గేదె చనిపోతే బీమా కంపెనీ పరి హారం అందజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన దృష్ట్యా ఇంకా ఎటువంటి సబ్సిడీ, రుణాల సమాచారం రాలేదు.