’పాక్ వేలుపెట్టడం ఆపేస్తే మంచిది’
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ భారత్కు చాలా ముఖ్యమని, అక్కడి ప్రజల భద్రత తమ ప్రధాన అంశమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలు, వాటివల్ల సామాన్యులకు జరిగిన నష్టం ప్రతి ఒక్క భారతీయుడిని బాధించిందని అన్నారు. పాక్ మూలంగానే ఇదంతా నెలకొందని చెప్పారు. పెల్లెట్ల కారణంగా కశ్మీర్ లో ఎంతోమంది యువకులు గాయపడ్డారని, వాటిని ఉపయోగించాలా వద్దా అనే అంశంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం అని ఆయన గుర్తు చేశారు.
ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. తాను పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తనకు నీరాజనాలు పలికారని, పాక్ మాత్రమే కశ్మీర్ యువకులను పక్కదోవపట్టి తుపాకులు చేతబట్టేలా చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఉగ్రవాద సమస్యతో బాధపడుతున్న ఆ దేశం తన సమస్యలు తాను చూసుకుంటే మంచిదని, భారత్ అంతరంగిక విషయాల్లో వేలుపెట్టడం మానుకోవాలని అన్నారు. పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారికి ఢిల్లీలో ఉచిత వైద్యం ఇప్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చామని ఆయన చెప్పారు. ఉపాధి లేమి, ఆర్థిక బలహీనత కశ్మీర్ లో అశాంతికి కారణంగా మారుతున్నాయని, వాటిని పారద్రోలేందుకు కూడా ప్రధాని ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించారని గుర్తు చేశారు.