‘నేచురల్ హిస్టరీ’ దగ్ధం
♦ మ్యూజియంలో అగ్నిప్రమాదం
♦ బుగ్గిపాలైన అరుదైన వస్తువులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అరుదైన జంతు, వృక్ష జాతుల నమూనాలకు నిలయమైన నేషనల్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మ్యూజియంలోని అత్యంత విలువైన వేలాది వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ నడిబొడ్డులో ఫిక్కీ భవనసముదాయంలో ఉన్న ఈ మ్యూజియంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45 గంటల సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మ్యూజియం పైఅంతస్తులో మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పుడు మంటలొచ్చాయి. అనంతరం ఇతర అంతస్తులకు వ్యాపించాయి. 170 మంది అగ్నిమాపక సిబ్బంది 35కుపైగా అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగి నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా వెలువడిన సెగలు, విపరీతమైన పొగల మధ్య ఊపిరాడక ఏడుగురు సిబ్బంది అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. భవనంలో అగ్ని నిరోధక వ్యవస్థలున్నప్పటికీ అవి పనిచేయలేదని అగ్నిమాపక శాఖ అధికారి రాజేశ్ పన్వర్ చెప్పారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మ్యూజియం జాతీయ సంపదని, అగ్నిప్రమాదంతో అందులోని వేలాది వస్తువులు దగ్ధమయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో తన మంత్రిత్వశాఖ పరిధిలోని అన్ని మ్యూజియాల్లో భద్రతా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. 1978లో నెలకొల్పిన ఈ మ్యూజియంలో సారోపోడ్గా పేర్కొనే డైనోసార్ ఎముక ముఖ్యమైనది. ఈ శిలాజం 16 కోట్ల సంవత్సరాల నాటిది. సీతాకోకచిలుకలు, కప్పలు, పాములు, బల్లుల నమూనాలను ఇక్కడ భద్రపరిచారు. ఇవికాక పులులు, చిరుతల స్పెసిమెన్లు ఉన్నాయి. ఇవన్నీ మంటల్లో కాలిపోయాయి. ఢిల్లీ పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేశారు.