జైలు గోడల వెనక...
అందరికీ తెలిసిన విషయాలే. ఎప్పటినుంచో పౌర సమాజ ప్రతినిధులు, హక్కుల సంఘాల బాధ్యులూ చెబుతున్నవే. కానీ కొత్తగా అధికారిక సమాచారం సైతం ఆ విషయాలే చెప్పినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఇంతమంది ఇన్నేళ్లుగా కృషి చేస్తున్నా పరిస్థితులు కాస్తయినా మారలేదా అన్న నిరాశ ఏర్పడుతుంది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) జైళ్ల స్థితిగతుల గురించి వెల్లడించిన సమాచారం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిర్బంధానికీ... నిస్సహాయతకూ, నిర్బంధానికీ... నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ... అణగారిన కులాల్లో, వర్గాల్లో పుట్టకకూ మధ్య సంబంధం ఉన్నదని ఆ సమాచారం మళ్లీ ధ్రువీకరించింది. విచారణ ఖైదీలుగా ఉంటున్నవారిలో, శిక్షలు పడినవారిలో అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అణగారిన కులాలకు, వర్గాలకూ చెందినవారేనని గణాంకాలు చెబుతు న్నాయి.
మన దేశంలో జనాభాకు అనుగుణంగా కేసులు విచారించే న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంవల్లనే న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని... ఆ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు జైళ్లలో మగ్గుతున్నారని 1987లో లా కమిషన్ నివేదిక తెలిపింది. పది లక్షలమంది జనాభాకు సగటున 10 మంది న్యాయమూర్తులుండే ప్రస్తుత స్థితిని మెరుగుపరిచి 2007 కల్లా పది లక్షల మందికి సగటున 50మంది న్యాయమూర్తులుండేలా చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా మారిందేమీ లేదు.
దేశంలోని 1,387 జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో 68 శాతంమంది విచారణలో ఉన్న వారేనని ఎన్సీఆర్బీ తెలిపింది. వారిలో 40 శాతానికి మించి ఆర్నెల్లు అంతకన్నా ఎక్కువగా జైళ్లలో ఉంటున్నారని వివరించింది. ఇలాంటివారిలో మూడు నెలలకు మించి జైళ్లలో ఉండేవారు నిరుటి కంటే పెరిగారని ఆ నివేదిక అంటున్నది. 2013లో అలాంటివారు 62.1 శాతంమంది ఉండగా ఇప్పుడు వారి శాతం 65కి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు 32 శాతంకన్నా రెట్టింపు. వాస్తవానికి ఈ శాతం ఆ ఏటికా యేడు పెరుగుతోంది. బెయిల్ తెచ్చుకునే స్తోమత లేనివారు, తమకుండే హక్కులు తెలియని నిరక్షరాస్యులు ప్రధానంగా జైళ్లలో మగ్గుతున్నారు. వారు పాల్పడ్డారం టున్న నేరానికి పడే శిక్షకు మించి అలాంటివారు జైళ్లలో గడుపుతున్నారు. 3 లక్షల 56 వేల 561 మంది ఖైదీలుండటానికి చోటున్న మన జైళ్లలో ఇప్పుడు 4 లక్షల 18 వేల 536 మంది ఉంటున్నారు. అంటే 117.4 శాతంమందితో జైళ్లు కిక్కిరిసి ఉంటు న్నాయన్న మాట. మావోయిస్టు ఉద్యమం జోరుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో జైళ్లు మరిం తగా కిక్కిరిశాయి.
అక్కడి జైళ్లలో 258.9 శాతంమంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికులు ఆదివాసీలేనని వేరే చెప్పనవసరం లేదు. మన జైళ్లలోదళిత, ఓబీసీ కులాలవారు, ఆదివాసీలు 62.3 శాతంమంది ఉండ గా... 31.4 శాతంమంది సాధారణ కేటగిరీకి సంబంధించినవారు. జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింలు... ఖైదీల్లో మాత్రం 21.1 శాతంగా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో మహిళా ఖైదీల సంఖ్య క్రమేపీ పెరుగుతోందని వివిధ నివేదికలు చెబుతు న్నాయి. మొత్తం ఖైదీల్లో మహిళా ఖైదీల శాతం 2003లో 3.9 ఉంటే అదిప్పుడు 4.55 శాతానికి చేరుకుంది. ఈ జాతీయ సగటు కంటే అధికంగా మహిళా ఖైదీలున్న రాష్ట్రాలు మిజోరం(7.58 శాతం), ఆంధ్రప్రదేశ్(6.28శాతం), పశ్చిమబెంగాల్ (6.11శాతం), మహారాష్ట్ర(5.68శాతం), ఛత్తీస్‌గఢ్(5.18శాతం) ఉన్నాయి.
అనవసరమైన కేసులవల్లనే విచారణ ఖైదీల సంఖ్య పెరుగుతున్నదని చాన్నాళ్లక్రితం జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక సైతం చెప్పింది. అలాగే పోలీసులు చేసే అరెస్టుల్లో దాదాపు 60 శాతం అనవసరమైనవేనని అభిప్రాయపడింది. ఇలాం టి కేసుల్లో అధిక భాగం గ్రామసీమల్లో పెత్తందార్లు, డబ్బు, పలుకుబడి ఉన్నవారు తమకు అడ్డుగా ఉన్నవారిపైనా, తమ మాట విననివారిపైనా పెడుతున్నవే. జైళ్ల కెళ్లడంవల్ల సాధారణ పౌరులకూ, వారి కుటుంబాలకూ సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సమాజం వెలేసినట్టు చూడటం... కుటుం బాన్ని పోషించేవారు జైలుపాలవడంవల్ల సంపాదన లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడటం, తమవారిని జైలునుంచి విడిపించుకోవడానికి ఏంచేయాలో, ఎవర్ని ఆశ్రయించాలో తెలియకపోవడం ఆ కుటుంబాల్లో పెను తుఫాన్లను సృష్టిస్తాయి.
ఈ సమస్య న్యాయస్థానాల దృష్టికి వెళ్లినప్పుడల్లా ఏవో ఆదేశాలు వెలువడుతున్నాయి. నేరం రుజువై పడే శిక్షలో సగం కాలం విచారణ ఖైదీగా జైళ్లలో ఉన్నవారిని గుర్తించి అలాంటివారిని విడుదల చేయాలని నిరుడు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే క్రిమినల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి కావడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని లా కమిషన్ సూచించినా...అసలు ఉన్న ఖాళీలను పూడ్చడమే ప్రభుత్వాలకు చేతగావడం లేదు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శాంతిభద్రతలకూ, ప్రముఖుల భద్రతకూ అధిక సంఖ్యలో పోలీసుల్ని వినియోగించాల్సి వస్తున్నప్పుడు దర్యాప్తులు సహజంగానే కుంటుబడతాయి.
సిబ్బంది తక్కువగా ఉండటం, దర్యాప్తు చేయడానికి అవసరమైన ఆధునిక విధానాల గురించి వారికి అవగాహన లేకపోవడం, అట్టడుగు కులాలవారిపైనా, వర్గాలపైనా అంతరాంతరాల్లో పాతుకుపోయిన అభిప్రాయాలు కేసుల్ని తెమల్చడంలో పెను అడ్డంకిగా ఉంటున్నాయి. దర్యాప్తులో నత్తనడక, అందులో ఉండే లోపాలు న్యాయస్థానాల్లో ఆ జాప్యాన్ని మరింత పెంచుతాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులైనా సాధారణ కోర్టులకు వర్తించే నిబంధనలకు లోబడి పనిచేయాలి గనుక ఆచరణలో వాటివల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి చిత్తశుద్ధితో పరిశీలిస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదు. ఈ దిశగా కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ పూనుకోవాలి.