ఎయిర్టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు తొలగింపు
⇒ 90% తగ్గిన ఇంటర్నేషనల్ కాల్ రేట్స్
⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి...
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ నేషనల్ రోమింగ్ చార్జీలను పూర్తిగా తొలగించింది. భారత్లో రోమింగ్కు సంబంధించి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా వినియోగంపై అన్ని రోమింగ్ చార్జీలను తొలగిస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతర్జాతీయ కాల్ రేట్లను 90 శాతం, డేటా చార్జీలను 99 శాతం తగ్గించామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ కాల్స్ నిమిషానికి కనిష్టంగా రూ.3, డేటా చార్జీలు ఒక్క ఎంబీకి రూ.3 చొప్పున ఉంటాయని పేర్కొన్నారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు.
ఇటీవలే రంగంలోకి వచ్చిన రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా తమ వినియోగదారులు రోమింగ్ చార్జీలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని గోపాల్ విట్టల్ చెప్పారు. నేషనల్ రోమింగ్లో ఉన్నప్పుడు అదనపు డేటా చార్జీలు కూడా ఉండవని, తమ వినియోగదారులకు ఇప్పుడు దేశం మొత్తం లోకల్ నెట్వర్క్లాగానే ఉంటుందని వివరించారు.
ఆనలాగ్ ప్రపంచంలో నియంత్రణ సంస్థలు...
బార్సిలోనా: పలు నియంత్రణ సంస్థలు ఇంకా అనలాగ్ ప్రపంచంలోనే ఉన్నాయని బారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. కంపెనీలు ఎక్కువగా ఉంటే, పోటీ తీవ్రంగా ఉంటుందనుకోవడం సరికాదన్నారు. చిన్న దేశాల్లో 2, పెద్ద దేశాల్లో అయితే మూడే టెలికం కంపెనీలుండాలని సూచిం చారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. ఎయిర్టెల్ టెలినార్ను కొనుగోలు చేయడం, ఐడియా, వొడాఫోన్ల విలీన వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.