National Seed Congress
-
రైతులు, కంపెనీల మధ్య పారదర్శక ఒప్పందం
జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానం సాక్షి, హైదరాబాద్: రైతులకు, విత్తన కంపెనీలకు మధ్య పారదర్శక ఒప్పందం ఉండాలని, ఆ మేరకు అనేక మార్పులు చేయాలని జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానించింది. వివరాలను విత్తన కాంగ్రెస్ నిర్వహక కమిటీ చైర్మన్ పార్థసారధి వెల్లడించారు. ⇒ రైతులు, కంపెనీలకు మధ్య ఒప్పందంలో మార్పులు ⇒ విత్తన పంటలకు ప్రత్యేక బీమా పథకం ⇒ విత్తన సహకార సంఘాలకు రూపకల్పన ⇒ వ్యవసాయ యాంత్రీకరణను విత్తనరంగంలోనూ విరివిగా వాడాలి ⇒ ప్రాసెసింగ్, క్లీనింగ్ పరికరాలను సబ్సిడీ, రుణాల రూపంలో రైతులకు అందించాలి ⇒ విత్తన పంటలకు కనీస మద్దతుధర ⇒ 15 నెలలపాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీని తీసుకురావాలి ⇒ ప్రభుత్వ, ప్రైవేటు మధ్య విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి ⇒ ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం-1966లో మార్పులు, చేర్పులు ⇒ దేశవ్యాప్తంగా ఒకేరకమైన ఏకీకృత విత్తన శాంపిళ్ల పరీక్ష పద్ధతులు తీసుకురావాలి ⇒ నకిలీ విత్తనాల తయారీ, విక్రయదారులకు కఠిన శిక్షలు విధించాలి ⇒ అంతర్జాతీయంగా నాణ్యమైన విత్తనాలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలి ⇒ లేబరేటరీ వ్యవస్థ ఉండాలి ⇒ విత్తన కంపెనీలకు కీలకమైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయాలి ⇒ గ్రామం యూనిట్‌గా ఐదు నుంచి పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక ⇒ విత్తన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారితో ఉద్యోగాల భర్తీ ⇒ బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలపై రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి -
1,600 మంది రైతుల ఆత్మహత్య
* జాతీయ విత్తన కాంగ్రెస్ ముగింపు సభలో కేంద్రమంత్రి దత్తాత్రేయ * కేంద్ర విత్తన చట్టాల్లో మార్పు చేస్తామని స్పష్టీకరణ * సమగ్ర వ్యవసాయ బీమా పథకానికి కేంద్రం కసరత్తు * విత్తన పంటకు ముందే ధర నిర్ణయిస్తామన్న మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1,600 నుంచి 1,800 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే ప్రభుత్వ లెక్కలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మూడురోజులుగా జరుగుతున్న జాతీయ విత్తన సదస్సు ముగింపు సభలో గురువారం ఆయన మాట్లాడారు. ఆదుకుంటామని విశ్వాసం రైతులకు కల్పించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సాగునీరు, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. నదుల అనుసంధానం, 24 గంటల విద్యుత్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. పంటలతోపాటు రైతు కుటుంబంలోని పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులు భరించేవిధంగా సమగ్ర వ్యవసాయ బీమా పథకాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విత్తన పంటల బీమా రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. 2004 బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దానికి చట్టరూపం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తానని హామీయిచ్చారు. రైతులపై రోజు రోజుకూ రుణభారం పెరుగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం తక్కువేనని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సదస్సులో రైతులతో జరిగిన ముఖాముఖిలోనూ, అనంతరం ముగింపు సభలోనూ మంత్రి మాట్లాడారు. పంట కాలానికి ముందే విత్తన ధరలు నిర్ణయించడం, బైబ్యాక్ ఒప్పందం,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచడం విత్తన పంటల సాగుకు లాభదాయకమన్నారు. రైతుల ఆత్మహత్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విత్తన పంటకు ఆలస్యంగా సొమ్ము చెల్లింపు: రైతుల గగ్గోలు తాము పండించిన విత్తన పంటలను తీసుకునే సర్కారు విత్తనోత్పత్తి సంస్థ సొమ్ము చెల్లించడంలో నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఆలస్యం చేస్తుందని మంత్రి పోచారంతో జరిగిన ముఖాముఖిలోనూ... అనంతరం తమను కలిసిన విలేకరుల ఇష్టాగోష్టిలోనూ రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తి సంస్థతో తాను 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని నల్లగొండ జిల్లాకు చెందిన రామ్మోహన్‌రెడ్డి ఆవేదన చెందారు. విత్తన పంటలకు తాము విక్రయించిన మూడు నెలలకు గానీ ధర నిర్ణయించడంలేదని... ఆరు నెలలకు సొమ్ము చెల్లిస్తున్నారని రైతులు రామకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. కొందరు రైతుల నుంచి బైబ్యాక్ కింద విలువైన విత్తనం తీసుకోకపోవడంతో సాధారణ పంటగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హాకా వంటి సంస్థలు సాధారణ పంట గింజలనే విత్తనంగా ప్యాకింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలకు, మధ్య దళారులకు విత్తనం అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన కంపెనీలకు ఒక్కో మండలాన్ని దత్తత ఇచ్చినా నియంత్రణ లేకపోతే నష్టమన్నారు. వ్యవసాయశాఖలో కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని రైతు అల్వాల్‌రెడ్డి అన్నారు. ఏవో, ఏడీఏలు గ్రామాలకు రావడంలేదన్నారు. ఉపాధి హామీ కూలీలను విత్తన రైతులకు కేటాయించాలని కోరారు. -
విత్తన భాండాగారంపై సర్కారు ప్రత్యేక దృష్టి
* అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మూడు రోజుల జాతీయ విత్తన కాంగ్రెస్ * దేశ విదేశాల నుంచి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులు హాజరు సాక్షి, హైదరాబాద్: విత్తన ఉత్పత్తి, ఎగుమతిలో రాష్ట్రాన్ని దేశానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. అందుకు కసరత్తు మొదలుపెట్టింది. విత్తన ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దాన్ని రైతులకు మరింత లాభసాటిగా తయారుచేయాలని సర్కారు ఆలోచన. ప్రస్తుతం ప్రైవేటు, బహుళజాతి కంపెనీలతో కలుపుకొని దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనంలో 70% తెలంగాణలోనే తయారవుతోంది. అందులో 62% 11 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి జరి గింది. 441 ప్రైవేటు కంపెనీలు విత్తన ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నా యి. మొత్తం విత్తన ఉత్పత్తిలో ప్రైవేటు వాటా 88% ఉండగా... ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాటా 12%. 98% బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తి మోన్శాంటో కంపెనీ చేతుల్లోనే ఉంది. పప్పుధాన్యాలు, శనగ విత్తనాల్లో మాత్రమే సీడ్ కార్పొరేషన్ తయారుచేస్తుంది. ఏటా హైబ్రీడ్ రకాలకు చెందిన వరి విత్తనం 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. కూరగాయలు, సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి మాత్రం రాష్ట్రం లో జరగడం లేదు. తెలంగాణకున్న నేల, వాతావరణ పరిస్థితి విత్తనతయారీకి అనుకూలమైనందున దీన్ని రైతుకు అనుగుణంగా మలచాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శాస్త్రవేత్తలు, బడా విత్తన కంపెనీలు, ఆ రంగంలోని దేశవిదేశీ ప్రముఖులను ఒక చోట చేర్చి ప్రణాళిక రచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్‌ను నిర్వహించాలని నిర్ణయించిం ది. ఈ అంశం ఇటీవల ఢిల్లీలో జాతీయ వ్యవసాయ విత్తన సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి విత్తన కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించిందని ‘సాక్షి’కి చెప్పారు. తేదీలు ఖరారు చేయలేదన్నారు. 3 రోజులు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశవిదేశాల నుంచి 400మంది శాస్త్రవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు.