విత్తన భాండాగారంపై సర్కారు ప్రత్యేక దృష్టి | National Seed Congress | Sakshi
Sakshi News home page

విత్తన భాండాగారంపై సర్కారు ప్రత్యేక దృష్టి

Published Sat, Jul 11 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

National Seed Congress

* అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మూడు రోజుల జాతీయ విత్తన కాంగ్రెస్
* దేశ విదేశాల నుంచి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులు హాజరు

సాక్షి, హైదరాబాద్: విత్తన ఉత్పత్తి, ఎగుమతిలో రాష్ట్రాన్ని దేశానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. అందుకు కసరత్తు మొదలుపెట్టింది. విత్తన ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దాన్ని రైతులకు మరింత లాభసాటిగా తయారుచేయాలని సర్కారు ఆలోచన. ప్రస్తుతం ప్రైవేటు, బహుళజాతి కంపెనీలతో కలుపుకొని దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనంలో 70% తెలంగాణలోనే తయారవుతోంది.

అందులో 62% 11 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి జరి గింది. 441 ప్రైవేటు కంపెనీలు విత్తన ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నా యి. మొత్తం విత్తన ఉత్పత్తిలో ప్రైవేటు వాటా 88% ఉండగా... ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాటా 12%. 98% బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తి మోన్‌శాంటో కంపెనీ చేతుల్లోనే ఉంది. పప్పుధాన్యాలు, శనగ విత్తనాల్లో మాత్రమే సీడ్ కార్పొరేషన్ తయారుచేస్తుంది. ఏటా హైబ్రీడ్ రకాలకు చెందిన వరి విత్తనం 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. కూరగాయలు, సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి మాత్రం రాష్ట్రం లో జరగడం లేదు. తెలంగాణకున్న నేల, వాతావరణ పరిస్థితి విత్తనతయారీకి అనుకూలమైనందున దీన్ని రైతుకు అనుగుణంగా మలచాలని నిర్ణయించింది.
 
హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్
విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శాస్త్రవేత్తలు, బడా విత్తన కంపెనీలు, ఆ రంగంలోని దేశవిదేశీ ప్రముఖులను ఒక చోట చేర్చి ప్రణాళిక రచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్‌ను నిర్వహించాలని నిర్ణయించిం ది. ఈ అంశం ఇటీవల ఢిల్లీలో జాతీయ వ్యవసాయ విత్తన సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది.

దీనికి హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి విత్తన కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించిందని ‘సాక్షి’కి చెప్పారు. తేదీలు ఖరారు చేయలేదన్నారు. 3 రోజులు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశవిదేశాల నుంచి 400మంది శాస్త్రవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement