తప్పుకోనున్న గగన్ ఖోడా, పరాంజపే
ముగ్గురితోనే జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ
న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సంస్కరణల అమలు నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుల కుదింపు జరగనుంది. ప్రస్తుతం ఐదుగురితో కొనసాగుతున్న ఈ కమిటీని టెస్టులు ఆడిన ముగ్గురి ఆటగాళ్లతో సరిపుచ్చాలని గతంలో ప్యానెల్ సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో గగన్ ఖోడా, జతిన్ పరాంజపే సెలక్టర్ల పదవి నుంచి తప్పుకోనున్నారు. వీరిద్దరికీ ఒక్క టెస్టు కూడా ఆడిన అనుభవం లేదు. గత సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీని నియమించింది.
తాజా పరిస్థితి కారణంగా ఎమ్మెస్కే, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్ ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే, టి20ల కోసం భారత జట్టును ఈనెల 5న ఎంపిక చేయనున్నారు. ‘కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో చూస్తాను. సీనియర్ జట్టు ఎంపిక సమయంలో కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. అతడు లేని పక్షంలో సంయుక్త కార్యదర్శి ఆ బాధ్యతలు చేపడతారు’ అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌధురి తెలిపారు.