National Thermal Power Corporation Limited
-
NTPC: భారత విద్యుత్తేజం ఎన్టీపీసీ
జ్యోతినగర్ (రామగుండం): భారతావనికి వెలుగులు అందిస్తూ విద్యుత్తేజంగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్టీపీసీ 74 విద్యుత్ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 7న ‘రైజింగ్ డే’.. స్వాతంత్య్రం అనంతరం దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంది. కేంద్రం పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం విద్యుత్ కేటాయించి, మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు నిర్మించాలంటే సమయం పడుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దీంతో ఈ రోజును సంస్థ ‘రైజింగ్ డే’గా నిర్వహిస్తోంది. 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతౌల్యం, మేనేజ్మెంట్ విధానాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలా నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్‌తో పాటు మొత్తంగా 74 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్‌లో ఎన్టీపీసీ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యుత్ సంస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. కరోనా సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశానికి ఎన్టీపీసీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వానికి మద్దతుగా పీఎం కేర్ ఫండ్‌కు రూ.257.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.250 కోట్లు కంపెనీవి కాగా, సంస్థ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.7.5 కోట్లు అందించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు. కరోనా ఉధృతిలో కాంట్రాక్టు, వలస కార్మికులకు నిత్యావసరాలు, వైద్యసేవలు అందించారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో నిలిచేందుకు సమన్వయంతో ముం దుసాగాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు ఒకప్పుడు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ భవిష్యత్ పోటీని ఎదుర్కొని ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంతంగా బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు చేస్తోంది. జాయింట్ వెంచర్ల పేరిట బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో వాటి భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మి స్తోంది. భవిష్యత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తే మొదట ఎన్టీపీసీకే అవకాశం దక్కనుంది. -
వెలుగుల ప్రస్థానం
స్పెషల్ స్టోరీ అభివృద్ధి అనే నాణేనికి మరో వైపు ‘మానవత్వం’ కనిపిస్తే అంతకుమించిన ఆనందం ఏముంటుంది? విజయానికి మరో వైపు.... ‘సేవాభావం’ వేనవేల వెలుగులు విరజిమ్మితే ఎంత బాగుంటుంది! ఎంతబాగుంటుందో ఓ సంస్థ నిరూపించింది. ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్) అనే పేరు విని పించగానే ‘లార్జెస్ట్ పవర్ కంపెనీ ఇన్ ఇండియా’ అని చెప్పేస్తాం. అయితే అభివృద్ధిలోనే కాదు... ‘సామాజిక సేవ’ లోనూ తను చాలా పెద్ద అని నిరూ పిస్తోంది ఎన్టీపీసీ. నిజమైన విజయం పది మంది జీవితాలను బాగు చేయడంలోనే ఉందని బలంగా నమ్ముతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ అయిన ఎన్టీపీసీ... ‘బ్రైటర్ టుడే అండ్ ఏ బెటర్ టుమారో’ నినాదంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణ నుంచి పేదపిల్లల చదువుల వరకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ సేవ చేస్తోంది. ముఖ్యంగా ఎన్టీపీసీ-సదరన్ రీజియన్ చేస్తోన్న కార్యక్రమాలు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ‘పవర్’కు ‘ప్రాఫిట్’కు మధ్య సేవ అనే రెండక్షరాలకు పెద్ద పీట వేసిన ఘనత ఎన్టీపీసీదే. విద్య, మౌలిక వసతుల కల్పన, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు, కమ్యూటినిటీ హెల్త్, శానిటేషన్, జెండర్ ఎంపవర్మెంట్ మొదలైన విభాగాల్లో అది చేస్తోన్న సేవ చూస్తే మనసు పులకించక మానదు. ఆ సంస్థ పట్ల గౌరవం ఉవ్వెత్తున ఎగియకా మానదు. సేవా తరంగం ఎగసిందిలా.... ‘చదువు అనేది విత్తనంలాంటిది. అది నాటితే మొక్కవుతుంది. ఎదిగి చెట్టవు తుంది. బతుకంతా నీడనిస్తుంది’ అని నమ్ముతుంది ఎన్టీపీసీ. అందుకే సీయస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) బడ్జెట్లో పదిహేను నుంచి ఇరవై శాతాన్ని విద్యకు కేటాయించింది ఈ సంస్థ. ఇందులో భాగంగా వయోజన విద్య, పాఠశాలల మౌలిక వసతులు, పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వాహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక నగదు బహుమతులు, సోలార్ లాంతర్లు, క్రీడా పరికరాలు, ఫ్యాన్లు, స్టడీ మెటీరియల్, యూనిఫామ్‌లు అందిస్తోంది. ఎన్టీపీసీ- రామగుండం పరిధిలో ఇరవై వేల మంది విదార్థులు లబ్ధి పొందారు. ఉన్నత, వృత్తివిద్యా కోర్సులను ప్రమోట్ చేయడానికి కూడా తన వంతు సహాకారం అందిస్తోంది ఎన్టీపీసీ. గోదావరిఖని పీజీ కాలేజీలో బిజినెస్ మెనేజ్మెంట్ స్కూల్ బిల్డింగ్ కోసం 70 లక్షలు, రామగుండంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ అదనపు గదుల నిర్మాణానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది ఎన్టీపీసీ-రామగుండం. ఇక ఎన్టీపీసీ-సింహాద్రి 12 లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చించి 23,000 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ అందించింది. 2014-15 సంవత్సరానికిగాను 330 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్‌లు అందించింది. రీ సైక్లింగ్ ద్వారా తయారుచేసిన నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది ఎన్టీపీసీ. ‘స్వచ్ఛ్ విద్యాలయ అభియాన్’ ప్రాజెక్టులో భాగంగా 17 రాష్ట్రాల్లో, 80 జిల్లాల్లో 16,000 పాఠశాలల్లో దాదాపు ఇరవై అయిదు వేల వరకూ మరుగుదొడ్లను నిర్మిం చింది. ఇక దక్షిణాదిలో ఎన్టీపీసీ-రామగుండం వారు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో 777 మరుగు దొడ్లను నిర్మించారు. విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లో ఎన్టీపీసీ-సింహాద్రి వారు 805 మరుగుదొడ్లను నిర్మించారు. ‘ఆకలితో ఉన్నవాడికి చేప ఇస్తే ఆ రోజుకే ఆకలి తీరుతుంది. చేపలను పట్టడం ఎలాగో నేర్పిస్తే ఆ వ్యక్తి జీవితాంతం సుఖంగా బతుకు తాడు’ అన్న మాటను నిజం చేస్తూ... వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తోంది ఎన్టీపీసీ. మోటర్ డ్రైవింగ్, వెబ్ పేజీ డిజైనింగ్, మోటర్ రీవైండింగ్, కంప్యూటర్ ట్రైనింగ్, మోటర్ డ్రైవింగ్, జనరల్ ఎలక్ట్రికల్, మొబైల్ రిపేరింగ్ మొదలైన అంశాల్లో యువతకు ఉచిత శిక్షణనిస్త్తోంది. కుష్ఠువ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా తోడ్పడ డానికి వారి పిల్లలకు ఆటోమోటివ్ సర్వీసెస్ టెక్నిషియన్ ట్రేడ్‌లో 40 రోజుల శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. మహిళలకు టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ రోలింగ్ లాంటి వృత్తి విద్యల్ని నేర్పించడం, వికలాంగులకు వివిధ రకాలుగా చేయూత నివ్వడం, ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను పంపిణీ చేయడం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఎన్నో మరెన్నో విధాలుగా సేవ చేస్తోంది. వీటన్నిటితో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. మొబైల్ హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవను అందిస్తోంది. సురక్షిత, స్వచ్ఛమైన నీరు తాగడం ప్రతి ఒక్కరి హక్కు అంటూ ఎన్నో గ్రామాల్లో రివర్స ఓస్మోసిస్ ప్లాంట్లను నెలకొల్పి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా నామమాత్రపు ధరలకే సురక్షిత నీటిని అందిస్తోంది. చెట్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించి పర్యావరణ పరిరక్షణకూ పాటు పడుతోంది. ఇలా సేవ చేయడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు ఎన్టీపీసీ. ఎన్నో రకాల కార్యక్రమాలతో ఎన్నో గ్రామాల్లో అభివృద్ధిని తీసుకొచ్చింది. ఎందరో జీవితాల్లో వెలుగులను నింపుతోంది.