వెలుగుల ప్రస్థానం | Lighted reigns!! | Sakshi
Sakshi News home page

వెలుగుల ప్రస్థానం

Published Sun, Dec 13 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన ఈ కుళాయిలు కొన్ని ఊళ్ల దాహాన్ని తీర్చాయి

ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన ఈ కుళాయిలు కొన్ని ఊళ్ల దాహాన్ని తీర్చాయి

స్పెషల్ స్టోరీ
అభివృద్ధి అనే నాణేనికి మరో వైపు ‘మానవత్వం’ కనిపిస్తే అంతకుమించిన ఆనందం ఏముంటుంది?
 విజయానికి  మరో వైపు.... ‘సేవాభావం’ వేనవేల వెలుగులు విరజిమ్మితే ఎంత బాగుంటుంది!
 ఎంతబాగుంటుందో ఓ సంస్థ నిరూపించింది.
 ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్) అనే పేరు విని పించగానే ‘లార్జెస్ట్  పవర్ కంపెనీ ఇన్ ఇండియా’ అని చెప్పేస్తాం. అయితే అభివృద్ధిలోనే కాదు...

‘సామాజిక సేవ’ లోనూ తను చాలా పెద్ద అని నిరూ పిస్తోంది ఎన్టీపీసీ. నిజమైన విజయం పది మంది జీవితాలను బాగు చేయడంలోనే ఉందని బలంగా నమ్ముతోంది.
 ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ అయిన ఎన్టీపీసీ... ‘బ్రైటర్ టుడే అండ్ ఏ బెటర్ టుమారో’ నినాదంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణ నుంచి పేదపిల్లల చదువుల వరకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ సేవ చేస్తోంది.

ముఖ్యంగా  ఎన్టీపీసీ-సదరన్ రీజియన్ చేస్తోన్న కార్యక్రమాలు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ‘పవర్’కు ‘ప్రాఫిట్’కు మధ్య సేవ అనే రెండక్షరాలకు పెద్ద పీట వేసిన ఘనత ఎన్టీపీసీదే. విద్య, మౌలిక వసతుల కల్పన,  కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లు,  కమ్యూటినిటీ హెల్త్, శానిటేషన్, జెండర్ ఎంపవర్‌మెంట్ మొదలైన విభాగాల్లో  అది చేస్తోన్న సేవ చూస్తే మనసు పులకించక మానదు. ఆ సంస్థ పట్ల గౌరవం ఉవ్వెత్తున ఎగియకా మానదు.
 
సేవా తరంగం ఎగసిందిలా....
‘చదువు అనేది విత్తనంలాంటిది. అది నాటితే మొక్కవుతుంది. ఎదిగి చెట్టవు తుంది. బతుకంతా నీడనిస్తుంది’ అని నమ్ముతుంది ఎన్టీపీసీ. అందుకే సీయస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) బడ్జెట్‌లో పదిహేను నుంచి ఇరవై శాతాన్ని విద్యకు కేటాయించింది ఈ సంస్థ. ఇందులో భాగంగా వయోజన విద్య, పాఠశాలల మౌలిక వసతులు, పోటీ పరీక్షల కోసం  విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వాహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక నగదు బహుమతులు, సోలార్ లాంతర్లు, క్రీడా పరికరాలు, ఫ్యాన్‌లు, స్టడీ మెటీరియల్, యూనిఫామ్‌లు అందిస్తోంది. ఎన్టీపీసీ- రామగుండం పరిధిలో ఇరవై వేల మంది విదార్థులు లబ్ధి పొందారు.
 
ఉన్నత, వృత్తివిద్యా కోర్సులను  ప్రమోట్ చేయడానికి కూడా తన వంతు సహాకారం అందిస్తోంది ఎన్టీపీసీ. గోదావరిఖని పీజీ కాలేజీలో బిజినెస్ మెనేజ్‌మెంట్ స్కూల్ బిల్డింగ్ కోసం 70 లక్షలు, రామగుండంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ అదనపు గదుల నిర్మాణానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది ఎన్టీపీసీ-రామగుండం. ఇక ఎన్టీపీసీ-సింహాద్రి 12 లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చించి 23,000 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ అందించింది.

2014-15 సంవత్సరానికిగాను 330 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్‌లు అందించింది. రీ సైక్లింగ్ ద్వారా తయారుచేసిన నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది ఎన్టీపీసీ. ‘స్వచ్ఛ్ విద్యాలయ అభియాన్’ ప్రాజెక్టులో భాగంగా 17 రాష్ట్రాల్లో, 80 జిల్లాల్లో 16,000 పాఠశాలల్లో దాదాపు ఇరవై అయిదు వేల వరకూ మరుగుదొడ్లను నిర్మిం చింది. ఇక దక్షిణాదిలో ఎన్టీపీసీ-రామగుండం వారు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో  777 మరుగు దొడ్లను నిర్మించారు. విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లో  ఎన్టీపీసీ-సింహాద్రి వారు 805 మరుగుదొడ్లను నిర్మించారు.
 
‘ఆకలితో ఉన్నవాడికి చేప ఇస్తే ఆ రోజుకే ఆకలి తీరుతుంది. చేపలను పట్టడం ఎలాగో నేర్పిస్తే ఆ వ్యక్తి జీవితాంతం సుఖంగా బతుకు తాడు’ అన్న మాటను నిజం చేస్తూ... వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తోంది ఎన్టీపీసీ. మోటర్ డ్రైవింగ్, వెబ్ పేజీ డిజైనింగ్, మోటర్ రీవైండింగ్, కంప్యూటర్ ట్రైనింగ్, మోటర్ డ్రైవింగ్, జనరల్ ఎలక్ట్రికల్, మొబైల్ రిపేరింగ్ మొదలైన అంశాల్లో యువతకు ఉచిత శిక్షణనిస్త్తోంది.
 
కుష్ఠువ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా తోడ్పడ డానికి వారి పిల్లలకు ఆటోమోటివ్ సర్వీసెస్ టెక్నిషియన్ ట్రేడ్‌లో 40 రోజుల శిక్షణ ఇప్పించి  ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. మహిళలకు టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ రోలింగ్ లాంటి వృత్తి విద్యల్ని నేర్పించడం, వికలాంగులకు వివిధ రకాలుగా చేయూత నివ్వడం, ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను పంపిణీ చేయడం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఎన్నో మరెన్నో విధాలుగా సేవ చేస్తోంది.

వీటన్నిటితో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. మొబైల్ హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవను అందిస్తోంది. సురక్షిత, స్వచ్ఛమైన నీరు తాగడం ప్రతి ఒక్కరి హక్కు అంటూ ఎన్నో గ్రామాల్లో రివర్‌‌స ఓస్మోసిస్ ప్లాంట్లను నెలకొల్పి విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ద్వారా నామమాత్రపు ధరలకే సురక్షిత నీటిని అందిస్తోంది. చెట్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించి పర్యావరణ పరిరక్షణకూ పాటు పడుతోంది.
 
ఇలా సేవ చేయడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు ఎన్టీపీసీ. ఎన్నో రకాల కార్యక్రమాలతో ఎన్నో గ్రామాల్లో అభివృద్ధిని తీసుకొచ్చింది. ఎందరో జీవితాల్లో వెలుగులను నింపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement