సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన వేళ పోలీసులు ప్రజలకోసం అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడుతూనే.. మరోవైపు తమలోని కరుణగుణాన్ని. మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వలసకూలీలు ఆకలి అనగానే వారికి అన్నం పెడుతున్నారు. అనారోగ్యమైతే ఆసరాగా ఉంటున్నారు. కష్టమొచ్చిందంటే అండగా నిలబడుతున్నారు. లాక్‌డౌన్ వేళ ఎవరు ఏమడిగినా.. వారి అవసరాలు తీర్చడమే పరమావధిగా పెట్టుకున్నారు. గత నెలరోజులుగా కుటుంబాలు వదిలి, ప్రాణాలను ఫణంగాపెట్టి 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తలసేమియా రోగులకు తమ రక్తమిచ్చి ప్రాణాలు పోస్తున్నారు.
గర్భవతులకు తోబుట్టువులై..
కరోనా కాలంలో వాహన సంచారం పూర్తిగా నిలిపేసింది ప్రభుత్వం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గర్భవతులకు ఖాకీలు తోబుట్టువు లవుతున్నారు. డయల్ 100కు ఫోన్ చేయగానే.. నిమిషాల్లో వచ్చి ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. డెలివరీ అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. ఒక్క గర్భవతులనే కాదు, అత్యవసర అపరేషన్ల విషయంలోనూ సాయం చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేస్తున్నారు.
కంటైన్మైంట్ల జోన్లలో..
లాక్‌డౌన్ నేపథ్యంలో జనసంచారంపై ఆంక్షలు అమలు చేస్తూనే, కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తోన్న కంటైన్మెంట్ జోన్లపై, హోంక్వారంటైన్లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అక్కడ ఉండే ప్రజలు ఇంట్లోనే ఉండేలా అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నారు.
బాగా తగ్గిన రెస్పాన్స్ టైం...
డయల్ 100కు సమాచారం ఇచ్చాక.. రెస్పాన్స్ టైమ్ ప్రకారం హైదరాబాద్‌లో అయితే.. 10 నుంచి 12 నిమిషాలు.. జిల్లాల్లో అయితే.. 8 నుంచి 9 నిమిషాలుగా ఉండేది. నగరాల్లో ట్రాఫిక్ కారణంగా అప్పుడప్పుడు కాస్త ఆలస్య మయ్యేది. కానీ, లాక్‌డౌన్ కారణంగా రోడ్లపై వాహన సంచారం పూర్తిగా తగ్గింది. ఫలితంగా నగరాల్లో 10 నిమిషాలు, జిల్లాల్లో 8 నిమిషాలలోపే అంబులెన్స్ లు ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి.
తలసేమియాతో బాధపడుతున్న
ఓ ఐదేళ్ల చిన్నారికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రక్తదానం చేసి ఆ పాప ప్రాణాలు నిలిపారు.
సైనిక్‌పురిలో ఒంటరిగా ఉంటున్న 60 ఏళ్ల తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండని అమెరికా నుంచి వినతి రాగానే వెంటనే రాచకొండ పోలీసులు వెళ్లి... సర్‌ప్రైజ్ చేసేలా పాటలు పాడి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment