రా.. రమ్మని..
అందాల విశాఖలోఅతిథుల సందడి
ఏటా పెరుగుతున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు
రెండేళ్లలో కోటి దాటనున్న పర్యాటకులు
సొగసైన సాగర అందాలు...మైమరపించే కైలాసగిరి సోయగాలు..ఔరా అనిపించే అరకు అందాలు..అబ్బురపరిచే బొర్రాగుహలు..ఒకటేమిటి...లెక్కకు మించిన ప్రకృతి అద్భుతాలు..విశాఖ పర్యాటకాన్ని పరుగులు తీయిస్తున్నాయి. ఏటేటా లక్షల మంది పర్యాటకులను నగరంవైపు నడిపిస్తున్నాయి. అతిథులతో నిత్యం సందడి చేస్తూ పర్యాటక రంగానికి చిరునామాగా మార్చేస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: స్వదేశీ, విదేశీ పర్యాటకుల రాకతో విశాఖ పోటెత్తుతోంది. నగరాన్ని చూడడానికి వచ్చే విదేశీ పర్యాటకులతో నగరం ఖండాంతర ఖ్యాతినార్జిస్తోంది. ప్రస్తుతం 67.63 లక్షల మంది అతిథులతో అలరారుతున్న ఆతిథ్యరంగం మరిన్ని కొత్త అందాలను సంతరించుకుంటూ వచ్చే రెండేళ్లలో కోటి మందికిపైగా పర్యాటకులను ఆకట్టుకునే దిశగా పరుగులు తీస్తోంది. ఏటా రికార్డు స్థాయిలో అతిథులు పెరుగుతున్నారు.
ఒకప్పుడు విశాఖలో పర్యాటక రంగం అంటే కేవలం సాగరతీరమే. పైగా ఈ అందాలను వీక్షించడానికి వచ్చే వారిలో స్థానికులే దిక్కు. కానీ ఇప్పుడు నగరంలో ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందడంతో ఆయా రంగాల పనులపై వచ్చే వారికి విశాఖ సరికొత్త అనుభూతులను మిగుల్చుతోంది.
ఒకపక్క సహజసిద్ధమైన కొండలు.. సాగరంలో దూసుకుపోయినట్టుండే డాల్ఫిన్ కొండలు..చవకైన ధరల్లో అందుబాటులో ఉండే హోటళ్లు.. రెస్టారెంట్లు.. కైలాసగిరి సోయగాలు.. చారిత్రక, సాంస్కృతిక అందాలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలు.. అరకు, బొర్రా గుహలు, హోరునపారే జలాపాతాలు ఎన్నో..ఎన్నెన్నో.. దీంతో విదేశీ పర్యాటకుల నుంచి విపరీతంగా డిమాండ్ ఏర్పడుతోంది.
ప్రసుత్తం నగరానికి 36 దేశాల నుంచి పర్యాటకులు వచ్చిపోతున్నారు. అమెరికా,ై చెనా, శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేషియా, స్విట్జర్లాండ్, ఇటలీ, కెనడా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, జర్మనీ.. ఇలా ఎన్నో దేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. 2011లో వీళ్ల సంఖ్య 29,455 కాగా, 2013నాటికి 57,476 మందికి చేరుకున్నారు. స్వదేశీ పర్యాటకులైతే విశాఖ పర్యాటకానికి మంత్రముగ్ధులవుతున్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్‌గఢ్, ముంబయి, కర్ణాటక, బీహార్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పంజాబ్ దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలివస్తున్నారు. విశాఖ అందాలను తనివితీరా వీక్షించడం కోసం ఏకంగా ఇళ్లను సైతం అద్దెకు తీసుకుని నెలల తరబడి ఇక్కడే బస చేస్తున్నారు. సాధారణంగా పర్యాటక రంగానికి వేసవి సీజన్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కానీ విశాఖకు మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా పర్యాటకులు పోటెత్తుతూనే ఉన్నారు.
2013లో అయితే 67లక్షల మంది పర్యాటకులు నగర అందాలను వీక్షించడానికి వచ్చినట్టు జిల్లా పర్యాటకశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక రకంగా ఈ సంఖ్య విశాఖ పర్యాటక చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రానురాను విశాఖకు పోటెత్తుతున్న పర్యాటకులు, అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ, విస్తరిస్తున్న హోటల్, హాస్పిటాలిటి తదితర రంగాల కారణంగా ఏటా కోటి మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు విశాఖకు ఎన్నో రోజులు పట్టేలా లేవనే చెప్పవచ్చు.
కారిడార్‌తో మరిన్ని అందాలు
బీచ్‌రోడ్డు నుంచి భీమిలి వరకు ఎన్నో పర్యాటక అందాలు విశాఖకు మాత్రమే సొంతం. ఇప్పటికే ఈ దారిలో పార్కులు, హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలు ఆహ్లాదపరుస్తున్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం రూ.45 కోట్లతో బీచ్ రోడ్డు నుంచి భీమిలి వరకు బీచ్‌కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించారు. మొత్తం ఆరు ప్యాకేజీలుగా పనులు విభజించారు.
అందులో భాగంగా భీమిలి, రుషికొండ, ఆర్కేబీచ్ ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. త్వరలో ఈ కారిడార్‌లో ఎమ్యూజ్మెంట్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు. మెడికేషన్ డెక్స్, జంగిల్‌బెల్స్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ పార్కులు, కొత్త వ్యూపాయింట్లు, ఎవెన్యూ ప్లాంటేషన్, సైన్ బోర్డులు, బీచ్ బజార్ తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే నగరానికి మరింత పర్యాటక శోభ రానుంది.