‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్ లాంచ్!
‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ విజయకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. అవసరాల శ్రీనివాస్ మరో హీరోగా నటిస్తున్నా ఈ సినిమాలో మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్. బాలాజీ సనాల దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాను రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 7న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముఖ్య అతిధులుగా హాజారు కాగా... హీరో నవీన్ విజయకృష్ణ, హీరోయిన్స్ మేఘ చౌదరి, సోఫియా, దర్శకుడు బాలాజీ సనాల, సంగీత దర్శకుడు కె.ఎమ్. రాధాకృష్ణ, కెమెరామెన్ జి.ఎల్.యెన్. బాబు, నిర్మాతలు పాల్గొన్నారు. అనంతరం చిత్ర టీజర్ ని సాయి ధరమ్ తేజ్, ఇంద్రగంటి మోహనకృష్ణ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుంది. టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి. లాస్ట్ టు ఇయర్స్ గా డిఫ్రెషన్లో వున్నప్పుడు నవీన్ సపోర్ట్ చేసి ధైర్యం చెప్పాడు. ఒక బ్రదర్ లా గైడ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసాడు. అలాంటి నవీన్ ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘నవీన్ నాకు గత పదేళ్లుగా తెలుసు. వెరీ బ్రిలియంట్ ఎడిటర్ తను. ఈ పోస్టర్ చూడగానే నాకు అష్టాచెమ్మా గుర్తుకువచ్చింది. గ్రామీణ నేపథ్యంలో ఆ పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగుంటుందని టీజర్ చూడగానే అర్ధం అయింది. ఇలాంటి మంచి సినిమా తీసిన టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమా హిట్ అయి నవీన్, శ్రీనివాస్ అవసరాలకు మంచి పేరు రావాలి. నిర్మాతలు పెద్ద విజయాన్ని అందుకోవాలి’ అన్నారు.
హీరో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. ‘సంవత్సరం కాలంగా ఈ సినిమా చేస్తున్నాం. అందరం కలిసి ఫ్యామిలీలా కలిసి వర్క్ చేసాం. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందర్నీ అలరిస్తుంది. కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. బాలాజీ బాగా తెరకెక్కించాడు. నిర్మాతలు మంచి క్వాలిటీతో ఈ సినిమా రూపొందించారు’ అన్నారు.