రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మల
‘‘ఎడిటర్‌గా నవీన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. నవీన్ నటిస్తున్న ఈ తొలి చిత్రం ట్రైలర్ చూశాను. చాలా ఈజ్‌తో నటించాడు. ఒక మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ నవీన్‌లో ఉన్నాయి. వచ్చే పుట్టినరోజుకు తను మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంటాడు’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ చంటి అడ్డాల ఓ చిత్రం నిర్మిస్తున్నారు.
రాంప్రసాద్ రగుతు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని నవీన్ విజయకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం నాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. కృష్ణ, విజయనిర్మల, జయసుధ సంయుక్తంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘నవీన్ మంచి ఎడిటర్. హీరోగా చేయాలని ఉందనగానే, ప్రోత్సహించాం. మంచి హీరోగా నిరూపించుకోవడానికి రెండేళ్ల పాటు తగిన కసరత్తులు చేసి, రంగంలోకి దిగాడు’’ అని చెప్పారు.
నరేశ్ మాట్లాడుతూ - ‘‘ఓ విజయవంతమైన చిత్రానికి కావాల్సిన దమ్మున్న కథతో నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. వేరే నిర్మాతలు నవీన్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చినప్పటికీ చంటి అడ్డాల మీద నమ్మకంతో ఆయన బేనర్లో సినిమా అంగీకరించాం’’ అన్నారు. ఇప్పటి వరకు జరిపిన షెడ్యూల్స్‌తో 70 శాతం సినిమా పూర్తయ్యిందనీ, వచ్చే నెలాఖరుకి మొత్తం పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. నవీన్ శారీరక భాషకు వంద శాతం నప్పే కథ ఇదని దర్శకుడు చెప్పారు. మంచి కమర్షియల్ అంశాలున్న చిత్రమిదని నవీన్ విజయకృష్ణ తెలిపారు.